ఉస్మానియా యూనివర్సిటీ, జూన్10 : రాష్ట్రంలో గౌడ్లు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకల కరపత్రాన్ని మంత్రి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం, గీత కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటున్నదని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు చెట్టు నుంచి జారిపడి మరణించిన గీత కార్మికులకు అందజేసే పరిహారాన్ని రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు పెంచామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో నీరా సెంటర్ల ఏర్పాటుకు అనుమతించడంతో పాటు నెక్లెస్ రోడ్డులో ప్రభుత్వమే సెంటర్ను నిర్మిస్తున్నదని పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారిగా మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్లకు రిజర్వేషన్లను కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. జై గౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 372వ జయంతి వారోత్సవాలను ఆగస్టు 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల పారంభోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహిస్తామని, దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గోవా, పాండిచ్చేరి, తమిళనాడుకు చెందిన గౌడ్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చిర్ర రాజు గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబొమ్మల కిశోర్ గౌడ్, నాయకులు మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్, పబ్బు భానుగౌడ్, మహేశ్, కన్నా గౌడ్, గుండ్రాతి నారాయణ గౌడ్, దొడ్డి అశోక్ గౌడ్, విష్ణువర్ధన్ గౌడ్ పాల్గొన్నారు.