బొడ్రాయిబజార్, జూన్ 10 : రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం సూర్యాపేట పట్టణంలోని 26వ వార్డులో రూ.20లక్షలు, 35వ వార్డులో రూ.20లక్షలు, 10వ వార్డులో రూ.10.45లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి సూర్యాపేట దశను మార్చారన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల, రింగ్‌రోడ్ల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తీసుకు రావడంతో పాటు వాటి నిర్మాణాలు సైతం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. నేడు 24 గంట ల విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడంతో పాటు రోడ్లు వెడల్పు చేసిన ఘనత మంత్రి జగదీశ్‌రెడ్డిదే అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతికి ప్రతినెలా రూ. 135 కోట్లు, పల్లె ప్రగతికి రూ. 345 కోట్లు కేటాయిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఇవ్వాల్సిన రూ. 1400 కోట్లు ఇవ్వక పోగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవిఆనంద్, మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు నిమ్మల స్రవంతి, జ్యోతి శ్రీవిద్యా కరుణాకర్, జాటోతు లక్ష్మి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, నాయకులు బత్తుల రమేశ్, బండారు రాజా, మల్లేశ్‌గౌడ్, ఉపేందర్, వట్టె లింగరాజు, మంద లింగరాజు, ఈఈ జీకేడీ ప్రసాద్, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సారగండ్ల శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.