రోహిణి కార్తెలో విత్తనం వేస్తే పుష్కలంగా పంట వస్తుందన్నది నానుడి. సరైన వర్షం కురిస్తే రోహిణిలోనే రైతులు వానకాలం సాగు మొదలు పెడుతారు. ఈ సీజన్లో మాత్రం నేటికీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మంచి వర్షాల్లేవు. జూన్ రెండో వారంలోనూ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. శుక్రవారం కూడా జిల్లా అంతటా 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. మరోవైపు రైతులు దుక్కులు దున్ని సాగుకు రెడీగా ఉన్నారు. మంచి వర్షం కురిస్తే పత్తి, కంది వంటి మెట్టపంటల సాగు కోసం ఎరువులు, విత్తనాలు సమకూర్చుకున్నారు. భూగర్భజలాలు పుష్కలంగా ఉండడంతో బోర్లు, బావుల కింద మాత్రం వరి నారు మడులకు రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే నారు పోశారు. గట్టి వాన పడితే పొలాలను దున్ని నాట్లకు సిద్ధం చేయడం సహజ ప్రక్రియ కాగా, మృగశిర కార్తె ప్రవేశించి మూడ్రోజులవుతున్నా సరైన వర్షాల్లేక పోవడంతో రైతుల్లో కొంత ఆందోళన కనిపిస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, జూన్10(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఈ సీజన్లో పంట సాగుపై వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల 1వ తేదీన నల్లగొండలో నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేటలో సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వానాకాలం సాగు అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వయంగా సమావేశాలు నిర్వహించి సూచనలు చేస్తూ వ్యవసాయాన్ని మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మార్చుకోవాలన్నారు.
ప్రత్యామ్నాయం పంటలతో లాభదాయక సాగు విధానాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులతో పాటు రైతు బంధు సమితి కోఆర్డినేటర్లకు సూచించారు. మరోవైపు ఇప్పటికే ఈ సీజన్లో సాగు అంచనాలు సిద్ధం చేసి అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. ఇక అధికారుల లెక్కల ప్రకారం ఈ వానాకాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 22 లక్షల ఎకరాల పైచిలుకు సాగు కానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 10.75 లక్షల ఎకరాల్లో వరి, 10.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. ఇదే సమయంలో సాంప్రదాయ పంటల సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని గత సీజన్ నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ మేరకు వీటిపైనా ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా పత్తి పంట ఇటీవల లాభదాయకంగా మారడంతో రైతులను అటువైపుగా ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. కేవలం వరి పంటపైనే కాకుండా నీటి ఆధారంగా సాగయ్యే ఇతర పంటల వైపు రైతులను మళ్లించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పామాయిల్ లాంటి వాణిజ్య పంటలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ సీజన్‌కు సంబంధించిన ఎరువుల అవసరాలపైనా ఇప్పటికే ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాకు కలిపి మొత్తం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 1.60 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 70,504 మెట్రిక్ టన్నుల డీఏపీతో పాటు 46,230 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు, 23,986 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ ఎరువులు అవసరం కానున్నట్లు అంచనా వేశారు. పంటల అవసరాలకు అనుగుణంగా వీటిని అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించారు.
సరైన వర్షం కురిస్తే రైతులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున సాగుకు ఉపక్రమించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతుల కోసం ఉమ్మడి జిల్లాలో పత్తి సాగుకు గానూ 27.50 లక్షల విత్తన ప్యాకెట్లు, వరి సాగుకు సంబంధించి 2.23 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని భావిస్తూ అందుబాటులో ఉంచారు. వీటిల్లోనూ తక్షణమే నారుమళ్లకు అవసరమైన విత్తనాలు మార్కెట్లకు వచ్చి ఉన్నాయి. వర్షాలను బట్టి సాగు అవసరాలను బట్టి వీటిని విడుతల వారీగా అందుబాటులో ఉంచనున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో పాటు వానలు సైతం తక్కువగా పడ్డాయి. సాధారణ వర్షపాతం 22.2 మి.మీ. ఉండగా గత ఏడాది 52.7 మి.మీ వర్షం పడటంతో 137 మి.మీ. అదనపు వర్షపాతం నమోదు అయింది. ఇక ఈ ఏడాది అదే సాధారణ వర్షపాతానికి 16.1 మి.మీ. వర్షం మాత్రమే పడటంతో 28 మి.మీ. లోటు వర్షపాతం నమోదైంది. ఇక ఉష్ణోగ్రతల విషయంలోనూ గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా నమోదు అయింది.
గత ఏడాది జూన్ 7వ తేదీన 38.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ ఏడాది ఇదే తేదీన 42.5 డిగ్రీలు నమోదైంది. 8వ తేదీన గత ఏడాది 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయితే ఈ ఏడాది 41 డిగ్రీలు. గతేడాది పదో తేదీన 38.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత.. 24.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయితే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రత 42. డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలు నమోదైంది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం సైతం తక్కువగా నమోదైంది.
గతంలో రోహిణీ కార్తెలోనూ భారీ వర్షాలు కురిసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో రోహిణీ కార్తెను బలమైన కార్తెగా భావిస్తూ రైతులు పంటల సాగుకు సిద్ధపడేవారు. కానీ ఈసారి రోహిణీ కార్తెలో రోళ్లు సైతం పగులుతాయనే నానుడిని గుర్తు చేస్తూ భానుడు నిప్పులు కురిపించాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో పలుమార్లు 45 డిగ్రీల ఉష్టోగ్రత సైతం నమోదైంది.
రోహిణీ పోయి ఈ నెల 8వ తేదీ నుంచి మృగశిర కార్తె మొదలైంది. మూడు రోజులు గడిచినా నేటికి ఎండ వేడిమి తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం సైతం నల్లగొండ జిల్లా కేంద్రంలో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. సాధారణంగా మృగశిర కార్తె ఆరంభం రోజున ఎంతోకొంత వర్షం కురుస్తుందన్న నానుడి కూడా ఈసారి కనిపించలేదు. ఈ కార్తెలోనైనా బలమైన వర్షాలు కురుస్తాయని రైతన్నలు ఎదురుచూస్తున్నారు.