గుండాల, జూన్ 3 : పల్లె ప్రగతి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్మజాల గ్రామంలో సర్పంచ్ సంగి బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఐదో విడుత పల్లె ప్రగతి పనుల ప్రారంభోత్సవ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3 నుంచి 18 వరకు పల్లె ప్రగతి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంగా పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.
పారదర్శకతతో పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గ్రామాల్లో రోజూ చెత్త సేకరణ పనులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. బహిరంగ మల విసర్జన చేస్తే జరిమానా విధించాలని సర్పంచ్ బాలకృష్ణను ఆదేశించారు. పరిశుభ్రత మొదట ఇంటి నుంచే ప్రారంభం కావాలని తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పల్లె ప్రగతిలో చురుగ్గా పాల్గొనాలని కోరారు.
అలాగే యువత శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి పనులను శక్తివంచన లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వెల్మజాలలో మెడికల్ ఆఫీసర్ సౌభాగ్య విధులపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ సమాధానమిస్తూ సౌభాగ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు త్వరలో నూతన మెడికల్ ఆఫీసర్ రానున్నట్లు తెలిపారు.
ఐసీడీఎస్ మోత్కూర్ ప్రాజెక్ట్ అధికారి జోత్స్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభను ఉద్ధేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని, ఐరన్ మాత్రలను వేసుకోవాలని సూచించారు. సరైన ఆహార నియమాలు పాటిస్తూ అనువైన వ్యాయామాలు చేయడం వల్ల సాధారణ ప్రసవాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
అనంతరం అనంతారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలను నాటాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ ఆర్.సునంద, డీడబ్యూఓ కృష్ణవేణి, జడ్పీ సీఈఓ సీహెచ్.కృష్ణారెడ్డి, మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ, తాసీల్దార్ శ్రీనివాస్‌రాజ్, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ జనార్దన్‌రెడ్డి, సర్పంచ్ తుమ్మ డెన్నీస్రెడ్డి, ఎంపీటీసీ బొంగు శ్రీశైలం, పీఆర్ఏఈ దామోదర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు యాక్పాషాబేగం, అండాలు, వెటర్నరి డాక్టర్ యాకూబ్, మండల వైద్యాధికారి డా.శివవర్మ, ఐబీఏఈ పరమేశ్వర్, వ్యవసాయ అధికారి లావణ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, పంచాయతీ కార్యదర్శి రాజు పాల్గొన్నారు.