రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.పచ్చల హారాన్ని సింగారించుకునేందుకు జిల్లా ముస్తాబైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 86.70 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. 5 మున్సిపాలిటీల్లో 16.50 లక్షలు, 475 గ్రామ పంచాయతీల్లో 70.20 లక్షల మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే జిల్లాలోని నర్సరీల్లో 1.50 కోట్ల మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే నాటాల్సిన మొక్కల లక్ష్యాలను నిర్దేశించగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు విస్తారంగా కురిసిన వెంటనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూర్యాపేట ,జూన్ 3 : విడుత హరితహారానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 86.70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో కోటి మొక్కలు పెంచుతున్నారు. వీటితో పాటు జిల్లాలోని ఐదు మున్సిపాటీల పరిధిలోని 56 నర్సరీల్లో 12.35 లక్షల మొక్కల పెంపకం చేపట్టారు. 8వ విడుత హరితహారంలో జిల్లాలోని అన్ని శాఖలకు లక్ష్యాలను నిర్దేశించి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగింది.
మొక్కలు నాటడానికి కావాల్సిన కందకాలతో పాటు ట్రీగార్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని నర్సరీల్లో 35 నుంచి 40 రకాల మొక్కలను పెంచడం జరిగింది. ప్రజలకు ఇష్టమైన మొక్కలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కల నుంచి భారీ వృక్షాలుగా మారే మొక్కల వరకు సిద్ధం చేశారు. పట్టణ ప్రాంతంలో ఇంటికి 6 మొక్కల చొప్పున ఇస్తుండగా గ్రామీణ ప్రాంతంలో సైతం ప్రజలకు అవరమైన మొక్కలు ఇవ్వడంతో పాటు రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటనున్నారు.
ప్రభుత్వ స్థలాలను సైతం గుర్తించి ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్న మొక్కలు నాటుతారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా పరిధిలో 7 హరితహారాల్లో సుమారు 5 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. నాటిన ప్రతి మొక్కకూ ట్యాంకర్ల ద్వారా నీరు అందించి సంరక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను కొనుగోలు చేయడం జరిగింది. అదే విధంగా మున్సిపాలిటీల్లో సైతం పెద్ద ఎత్తున్న ట్రాక్టర్లు, ట్యాంకర్లు కొనుగోలు చేశారు.
8వ విడుత హరితహారంలో మొక్కలు నాటేందకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం జిల్లా యాంత్రాంగం ఎదురు చూస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 8వ విడుత హరితహారాన్ని ప్రారంభించిన వెంటనే జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి ముగిసే సరికి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
8వ విడుత హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మొదలు పెడుతాం. ఇప్పటికే 475 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు కోటి మొక్కలు పెంచడం జరుగుతుంది. నిర్ధేశించిన లక్ష్యం కంటే అదనంగా నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటు విజయవంతంగా పూర్తి చేస్తాం.
– సుందరి కిరణ్‌కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి