ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రగతి అడుగులకు తోడు పచ్చదనాన్ని జోడిస్తూ ఎనిమిదో విడుత నిర్వహిస్తున్న హరితహారానికి కూడా శ్రీకారం చుట్టారు. జిల్లా అంతటా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రగతి కార్యక్రమాల సందడి కనిపించింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మొదలుకుని గ్రామంలోని వార్డుస్థాయి ప్రజాప్రతినిధి వరకు అందరూ భాగస్వాములయ్యారు. కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అధికార యంత్రాంగమంతా చేతులు కలిపారు. 15 రోజుల పాటు కొనసాగే కార్యాచరణలో తొలిరోజు విజయవంతంగా ముగిసింది. అన్నిచోట్లా గ్రామసభలు నిర్వహించి మొక్కలు నాటి అభివృద్ధి ఎజెండాపై చర్చించారు. నేడు రెండోరోజు క్రీడామైదానాల స్థలాల పరిశీలన, ఇప్పటికే గుర్తిస్తే చదును చేసే పనులు, అవి కూడా పూర్తయితే ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన విధంగా జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. అన్ని గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో ప్రగతి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. అన్ని చోట్లా గ్రామసభలు విధిగా నిర్వహించారు. ఇందులో ఆయా ప్రాంతాల అభివృద్ధిపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. తొలి రోజు జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులంతా భాగస్వాములయ్యారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ 1, 2వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఆయా వార్డుల్లోని ప్రజలతో సభ నిర్వహించి, అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు.
తిప్పర్తి మండలం రాజుపేటలో మన ఊరు- మన బడిలో భాగంగా పలు పనులకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. మాడ్గులపల్లి, ఇందుగుల గ్రామాల్లోనూ పల్లె ప్రగతిని ప్రారంభించారు. నకిరేకల్ నియోజకవర్గంలో తొలి రోజు పలు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. నకిరేకల్ మండలం నడిగూడెంలో మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గ్రామసభలో అభివృద్ధిపై చర్చించారు. కట్టంగూర్ మండల కేంద్రంలో పల్లె ప్రగతిని ప్రారంభించి గ్రామ సభలో ఎమ్మెల్యే చిరుమర్తి పాల్గొన్నారు.
అక్కడ కోటి రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పల్లెలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రతి నెలా నిధులు ఇస్తున్నారని చెప్పారు. వాటి ద్వారా గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పలు చోట్ల పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారు. పీఏపల్లి మండలం పెద్దగట్టులో పల్లె ప్రగతిని ప్రారంభిస్తూ గ్రామ సభలో మాట్లాడారు. మారుమూల గ్రామాల్లో సైతం మౌలిక వసతుల కల్పనకు సర్కార్ పెద్దపీట వేస్తున్నదని, పల్లె ప్రగతి అందుకు ఎంతో దోహద పడుతుందని ఎమ్మెల్యే చెప్పారు.
అనంతరం అక్కడే కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి అటవీ భూములను పరిశీలించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధి 4వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల భగత్ పల్లె ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మొక్కలు నాటారు. త్రిపురారం మండలం కొణతాలపల్లిలో పల్లె ప్రగతిని ప్రారంభించి మొక్కలు నాటారు.
అనంతరం అక్కడే స్థానిక ప్రజాప్రతినిధులు, యువతతో కలిసి తెలంగాణ క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. పల్లెల నుంచి మెరుగైన క్రీడాకారులను దేశానికి అందించేందుకు క్రీడా మైదానాలు ఎంతో ఉపయుక్తం అవుతాయన్నారు. శాలిగౌరారం మండలం అడ్లూరులో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామసభలో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ ఇలా గ్రామాల అభివృద్ధికి నిరంతరం నిధులు ఇస్తున్న దాఖలాలు లేవన్నారు.
పల్లెల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. అనంతరం ఊట్కూర్ గ్రామంలో పల్లె ప్రగతి ర్యాలీలో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ పాల్గొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్లా పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కాగా తొలి రోజు గ్రామసభలు నిర్వహించి అభివృద్ధిపై చర్చించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా తొలి రోజు ప్రగతి కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని గ్రామసభలు నిర్వహించి, గ్రామాల్లో పర్యటనలు చేశారు.
మర్రిగూడెం మండలం రాంరెడ్డిపల్లిలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ గ్రామసభలో పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా రెండో రోజు శనివారం అన్నిచోట్లా క్రీడా మైదానాలకు స్థలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే గుర్తిస్తే వాటిని ఆట స్థలాలకు అనువుగా చదును చేసి కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇక సిద్ధ్దం చేసిన వాటిని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నీలగిరి, జూన్ 3 : ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావడం అభివృద్ధికి సంకేతమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం పానగల్‌లోని 1, 2వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాలనీల్లో అవసరాలను గుర్తించి ప్రణాళిక తయారు చేసుకుని పట్టణ ప్రగతిలో అమలుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తిప్పర్తి మండలం బండ్లవారిగూడెంలో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని పాఠశాల భవన నిర్మాణానికి తన నిధుల నుంచి ఐదు లక్షలు ఇస్తానని ఎంపీ బడుగుల హామీ ఇచ్చారు.

కట్టంగూర్, జూన్ 3 : ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాలు పల్లె ప్రగతితో నేడు అన్ని విధాలా ప్రగతిలో ఉన్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్‌లో పల్లె ప్రగతి గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని ఆనాడు మహాత్మాగాంధీ చాటిచెబితే.. పల్లె ప్రగతితోనే తెలంగాణ ప్రగతి ఇమిడి ఉందని నేడు సీఎం కేసీఆర్ ఆచరణలో చూపిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

నిడమనూరు, జూన్ 3 : గ్రామాల సమగ్రాభివృద్ధే పల్లె ప్రగతి లక్ష్యమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. మండలంలోని ముకుందాపురం గ్రామంలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. త్రిపురారం మండలం కొణతాలపల్లిలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతితో పల్లెల ముఖ చిత్రాలు మారాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు ఖర్చు చేస్తుండడంతో పల్లెల్లో అభివృద్ధి చాయలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయన్నారు.

దేవరకొండ, జూన్ 3 : పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేయడమే సర్కారు లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని 4వ వార్డులో పట్టణ ప్రగతిలో, పీఏపల్లి మండలంలోని పెద్దగట్టు, ఘనపురం గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. ప్రజాప్రతినిధులు, ప్రజలంతా భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
