పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నాం.. చిన్న రాష్ట్రమైనా, అతి తక్కువ సమయంలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలు అమలు చేస్తున్నాం.. దేశంలో ఏ రాష్ట్రంతో తెలంగాణకు పోటీ లేదు, రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలకు మధ్యనే పోటీ’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలో పలు వార్డుల్లో మంత్రి పర్యటించారు.
సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. సూర్యాపేటలో దళితబంధు వాహనాలను ప్రారంభించగా పెన్‌పహాడ్ మండలం నూర్జహాన్పేటలో 18 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికీ మంచి నీరు, చెత్త తరలింపునకు ట్రాక్టర్, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు రాష్ట్ర అభివృద్ధికి చిహ్నాలని అన్నారు. దేశంలో అన్ని సౌకర్యాలతో ఉన్న 20గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణలో ఉండడం గర్వకారణమని తెలిపారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని కోరారు.
బొడ్రాయిబజార్, జూన్ 3 : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానికి సాటేదీ లేదని, మన పల్లెలు, పట్టణాల మధ్యే పోటీ ఉందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు, దళితబంధు పథకం కింద కొనుగోలు చేసిన ట్యాక్సీ కారు ప్రారంభించి మాట్లాడారు. మంచి నాగరికతలో తెలంగాణ సమాజం తయారు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో మనం కన్న కలలు ఎనిమిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ సాకారం చేశారన్నారు.
చిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే ముందంజలో ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అన్ని గ్రామ పంచాయితీల్లోనూ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఉందంటే అది తెలంగాణలోనే అన్నారు. పట్టణాల్లో సైతం అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ వైకుంఠధామాలు, పట్టణ ప్రకృతి వనాలు, ప్రతి నిత్యం మంచినీరు అందించే సురక్షితమైన మంచినీటి పథకాలు ఉన్నాయన్నారు. దేశంలో 20గ్రామాలు ఏవి బాగున్నాయని లెక్క తీస్తే తెలంగాణలోనే 19గ్రామాలు ఉంటాయన్నారు. తెలంగాణ అభివృద్ధిని దాచి పెడుదామని, కనపడనీయకుండా చేద్దామని ప్రయత్నిస్తే వాళ్లు సైతం ఒప్పుకోక తప్పని పరిస్థితిలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాల కల్పనకు పల్లె, పట్టణ ప్రగతి చేపడుతున్నామని తెలిపారు.
ఇవాళ విదేశాలకు పోయిన వారు, గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన వారు మళ్లీ వాళ్ల జాడలు వెతుక్కుంటూ గ్రామాలకు వస్తున్నారన్నారు. ప్రభుత్వం కేవలం పాలసీలను మాత్రమే తెస్తుందని, వాటి అమలులో అధికారుల కృషి చాలా ఉంటుందన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ప్రతి పథకం విజయవంతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. జిల్లాకేంద్రంలోని సద్దుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుకున్నామని, పుల్లారెడ్డి చెరువును సైతం ట్యాంక్‌బండ్‌గా సుందరీకరిస్తున్నామని తెలిపారు.
నెక్లస్ రోడ్ అంటే హైదరాబాద్ పేరు చెబుతామని ఇప్పుడు సూర్యాపేటలో సద్దులచెరువు, పుల్లారెడ్డి చెరువులకు రెండు నెక్లెస్ రోడ్లు ఉన్నాయన్నారు. పుల్లారెడ్డి చెరువు కట్ట ఎత్తు పెంచడంతో ముంపు బాధ తప్పిందన్నారు. చెరువు కత్వాల వద్ద గేట్లు పెడుతున్నామని, మళ్లీ సూర్యాపేటలో వర్షమొస్తే పుల్లారెడ్డి చెరువు నిండి ప్రాంతాలు మునగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.
చెట్ల పెంపకంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. సూర్యాపేటను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం 37వ వార్డుకు చెందిన నిరుపేద ఎల్గూరి నాగరాజు కుమార్తె సిరి వివాహానికి వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు అనంతుల దుర్గాప్రసాద్ అందజేసిన రూ. 30వేలను మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీఆనంద్, మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు ఆకుల కవిత లవకుశ, మొరిశెట్టి సుధారాణి శ్రీనివాస్, బైరు శైలేందర్, అనంతుల దుర్గాప్రసాద్, చింతలపాటి భరత్ మహజన్, ఎస్.కే తాహేర్, బత్తుల రమేశ్, ఈఈ జీకేడీ ప్రసాద్, డీఈ సత్యారావు, మెప్మా పీడీ రమేష్‌నాయక్, ఏఈ సుమంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ పాల్గొన్నారు.