భువనగిరి కలెక్టరేట్, జూన్ 2 : గ్రామాలు పూర్తిస్థాయిలో సమగ్రాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సంబంధించిన దిశా నిర్దేశాన్ని క్షేత్రస్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తగు మార్గదర్శకాలు నిర్ధేశించారు. ఈ నెల 18 వరకు జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, 421గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.
పల్లె, పట్టణ ప్రగతి నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనుంది. సంబంధిత శాఖల అధికారులతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్విరామంగా చేపట్టనున్నారు. ప్రతి రోజు వార్డుల్లో సభలు నిర్వహించి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేపట్టేలా సమగ్ర చర్యలు చేపడుతారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారనున్నాయి. ఎక్కడ సమస్య తలెత్తినా ఆయా కమిటీల నేతృత్వంలో పరిష్కార మార్గాలను చూపుతారు. ఆయా కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన బోర్డుల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఏది ఏమైనప్పటికీ 5వ విడత పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, మున్సిపాలిటీల్లో సమస్యలు తీరనున్నాయి.