రామగిరి, జూన్ 1 : ఈ నెల 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సౌకర్యాలు, ఇతర అంశాలను ప్రజలకు వివరించేందుకు విద్యాశాఖ పలు కార్యక్రమాలకు చేపట్టనున్నది. అందులో భాగంగా శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కార్పొరేట్, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం 10 జీపీఏ సాధించిన విద్యార్థులు ఉన్నారని, ఆవిషయాన్ని తల్లిదండ్రులకు తెలపడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలనే సంకల్పంతో ప్రభుత్వ సూచనల మేరకు బడి బాటను నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అందుబాటులోకి వస్తుండటంతో ప్రభుత్వ బడులకు విద్యార్థులు క్యూ కట్టానున్నట్లు తెలుస్తున్నది.
దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 3 నుంచి 10 వరకు విద్యార్థుల నమోదు, ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 13 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని ఆవాస ప్రాంతాల్లోని బడీడు పిల్లలను బడుల్లో చేర్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆంగ్ల మాధ్యమం అమలు, ప్రభుత్వ బడుల్లో హాజరుశాతం పెంచడం, నాణ్యమైన విద్య అందించటమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో బడిబాట సమన్వయ సమావేశాలు ఈ నెల 1, 2న నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు కలిసి రోజు వారి బడి బాటలో పాల్గొనేలా ప్రణాళికలు తయారు చేశారు.
13న మన ఊరు-మన బడిపై అవగాహన, 14న ఆంగ్లమాధ్యంపై ప్రచారం, 15న తల్లిదండ్రులతో సమావేశాలు, 16న పాఠశాల యాజమాన్య కమిటీలతో, 17న స్వయం సహాయక బృందాలతో సమావేశం, 18న బాలికావిద్యపై అవగాహన, 20న సామూహిక అక్షరాభాస్యాలు, 21న స్వచ్ఛ పక్షోత్సవం, 22న హరితహారం, 23న ప్రత్యేక అవసరాలు గల పిల్లల నమోదు, 24న బాలసభ, 25న చదువుల మేళా, 27న బడి బయటి విద్యార్థుల నమోదు, 28న ద్విభాష పుస్తకాలపై అవగాహన , 29న డిజిటల్ ఎడ్యుకేషన్‌పై అవగాహన, 30న గణితం,
సైన్స్‌డే నిర్వహణ
ఈ నెల 3 నుంచి 10 బడి బాట ఎన్రోల్మెంట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచి 11 వరకు అన్ని పాఠశాలల పరిధిలోని ప్రాంతాల్లో హెచ్ఎంల ఆధ్వర్యంలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీ, పిల్లలను బడిలో చేర్పించడం వంటివి చేపడుతారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుర్తించిన బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నానరు. బడి బాట కార్యక్రమ వివరాలను జిల్లా బడి బాట డెస్క్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. కొత్తగా నమోదైన విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.