‘అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర కాంక్షలను నెరవేర్చి ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లారు. ఎంతో మంది పేదల బతుకులకు భరోసా కల్పిస్తూ పాలన సాగిస్తున్నారు’ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో జెండావిష్కరించి మాట్లాడారు. నల్లగొండ జిల్లా ప్రగతిని వివరించారు. ప్రాజెక్టుల పూర్తితో పుష్కలంగా సాగు నీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతో రైతులకు భరోసాఏర్పడిందన్నారు.
మన ఊరు..మన బడి కార్యక్రమంతో స్కూళ్లు కార్పొరేట్‌గా దీటుగా మారనున్నాయని, దళిత బంధు పథకంతో దళితులు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో జిల్లాలో గణనీయమైన మార్పు జరిగిందని చెప్పారు. వివిధ వృత్తిదారులకు చేయూత, పల్టె, పట్టణ ప్రగతితో ప్రజలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారన్నారు.
తెలంగాణ అవతరణ పండుగను జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. కరోనా కారణంగా రెండేండ్ల అనంతరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూల మాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు.
నల్లగొండ కలెక్టరేట్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగుర వేసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి పాల్గొన్నారు. నియోజకవర్గం, మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రతిచోటా జై తెలంగాణ, జయహో తెలంగాణ నినాదాలు మిన్నంటాయి.
‘పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధిలో పరుగులు పడుతూ అద్భుతమైన ఫలితాలు సాధించిన తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది.’ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు క్లాక్‌టవర్ సెంటర్లో అమరవీరుల స్తూపానికి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నివాళులర్పించారు.
అనంతరం కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసిన రాష్ట్ర ప్రజలు రెండోసారి బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ను గెలిపించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి అంతకు మించిన అభివృద్ధి చేస్తూ 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను ఎనిమిదేండ్లలో సరిదిద్ది దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు.
– నల్లగొండ, జూన్ 2
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని గుత్తా అన్నారు. దళితుల ఆర్థిక సాధికారత కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు గొప్ప పథకమని, ఈ ఆలోచన దేశంలో ఏ ముఖ్యమంత్రికీ రాలేదని పేర్కొన్నారు. మన ఊరు-మన బడి పేరుతో ఒక్కో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.30లక్షల దాకా వెచ్చించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వినియోగంలోకి తెచ్చారని తెలిపారు. నల్లగొండలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, వరద కాల్వ, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి దక్కిందన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతు పక్షపాతి ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో నిరంతరం అభివృద్ధి కొనసాగుతుందన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.20 కోట్లు ఇస్తున్న సర్కార్ ఏడు మున్సిపాలిటీలకు రూ.6.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరో విడుత చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములై పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లతో యాదాద్రి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిందన్నారు.
నల్లగొండ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గుత్తా అన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. దామరచర్లలో 4 వేల మెగావాట్ల ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, జిల్లా కేంద్రంలో బత్తాయి, నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్లతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా వేల ఎకరాలు సాగులోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. యాదవులకు సబ్సిడీపై గొర్రెలు, చెరువుల్లో చేప పిల్లలు వదులుతున్నారని తెలిపారు.

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంటే.. ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నదన్నారు. రాష్ర్టానికి కేంద్రం ఇవ్వాల్సిన 35వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసే విధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పల్లె ప్రగతికి సంబంధించి కూడా వెయ్యి కోట్లు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గ్రహించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం సరికాదని సూచించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్‌కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్, రాహుల్‌శర్మ, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, కమాండెంట్ సాంబయ్య పాల్గొన్నారు.