న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: న్యాయమూర్తులు అసంపూర్ణులుగా ఉంటే న్యాయ వ్యవస్థ ఇబ్బంది పడదని, అయితే వారు పరిపూర్ణులుగా కనిపించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం అది ఇబ్బంది పడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కామన్వెల్త్ దేశాల్లో న్యాయ విద్య, న్యాయవాదులు, న్యాయమూర్తులను అనుసంధానించడానికి ఒక సంస్థను సృష్టించాలని ఆయన సూచించారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తులు కేవలం గత తీర్పుల ఆధారంగానే వ్యహరించకూడదని, వాటిని అర్థం చేసుకుని ప్రస్తుత పరిస్థితులకు వాటిని ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుని తీర్పు ఇవ్వాలన్నారు.
గతంలో న్యాయవ్యవస్థలో పేరొందిన వ్యక్తులంతా తమ అసంపూర్ణత్వాన్ని ఒప్పుకొన్నారని, తమ పరిమితులు గుర్తించారని, తప్పులు జరగడానికి గల అవకాశాలను అంగీకరించారని, నేర్చుకోవడానికి సంసిద్ధత తెలిపారని అంటూ ఇది ప్రస్తుతమున్న వారందరికీ వర్తిస్తుందని అన్నారు. వినయం అనేది వ్యక్తిగత లక్షణం కాదని, అది వృత్తికి రక్షణ కవచమని, దీనిని ప్రతి న్యాయాధికారికీ బోధించాలని అన్నారు. న్యాయమూర్తులు తమ పరిమితులను అర్థం చేసుకోవాలని, తప్పులు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే చట్టం అనేది సమాజంతో పరిణామం చెందే ఒక శక్తిమంతమైన వ్యవస్థ అని సీజేఐ పేర్కొన్నారు.