రామగిరి, జూన్ 2 : రాష్ట్రం ఏర్పాటైన తరువాత కవులు, కళాకారులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు.
వేల పుస్తకాలు చదివినా రాణి చైతన్యం.. ఒక్క పాట ద్వారా వస్తుందన్నారు. అందెశ్రీ రాసిన జై తెలంగాణ పాట ఉద్యమానికి ఊతం పోసిందని, ఆయన బాటలో గోరటి వెంకన్న, గద్దర్, రసమయి లాంటి వారు రాసిన పాటలు అనేక మందిని ఉద్యమంలో భాగస్వాములను చేసినట్లు తెలిపారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 8 ఏండ్లలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందంటే అది కేవలం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటులో మలిదశ ఉద్యమం కీలకంగా మరిందని పేర్కొన్నారు. ఉద్యమ చరిత్ర కోసం తొలి, మలి దశ ఉద్యమాల పుస్తకాలను చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా 25 మంది కవులకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, రాహుల్ శర్మ, డీఆర్ఓ జగదీశ్వర్‌రెడ్డి, డీపీఆర్ఓ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, కవులు, కళాకారులు పాల్గొన్నారు.