సివిల్స్‌లో ఉమ్మడి నల్లగొండకు చెందిన ఇద్దరు అభ్యర్థులు సత్తా చాటారు. యూపీఎస్సీ సోమవారం వెల్లడించిన ఫలితాల్లో సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొక్క చైతన్యరెడ్డి 161వ ర్యాంకుతో సత్తా చాటారు. తిరుమలగిరి మండలంలోని సిద్ధిసముద్రంతండాకు చెందిన ధరావత్ సాయిప్రకాశ్ 650వ ర్యాంకుతో ప్రతిభ కనబర్చారు. చైతన్య కుటుంబం వరంగల్‌లో స్థిరపడింది. మొదట సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన చైతన్య టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలో ఇరిగేషన్ శాఖ క్వాలిటీ కంట్రోల్లో ఉద్యోగం సాధించి భువనగిరిలో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్ సాధించినట్టు చెప్పిన చైతన్యరెడ్డి తనకు వచ్చిన ర్యాంకు ప్రకారం ఐపీఎస్ అయ్యి ప్రజా సేవలో భాగస్వామి అయ్యే అవకాశం దక్కనుందని సంతోషంగా తెలిపారు. జగదేవ్‌పూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ధరావత్ రవీందర్ కుమారుడు సాయిప్రకాశ్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం విశేషం.
నూతనకల్, మే 30 : యూపీఎస్సీ సోమవారం విడుదల చేసిన సివిల్స్ 2021 ఫలితాల్లో నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొక్క సంజీవరెడ్డి కుమార్తె బొక్క చైతన్యరెడ్డి 161వ ర్యాంకు సాధించింది. చదువు పూర్తయిన తరువాత చైతన్యరెడ్డి రెండు ఉద్యోగాలు చేసి తన చిన్నప్పటి సివిల్స్ గోల్ మూడో అటెంప్ట్‌లో ర్యాంకు సాధించింది. ర్యాంకు ప్రకారం ఐపీఎస్ అయ్యే అవకాశం ఉందని, తన గోల్ సాధించడంద పట్ల సంతోషంగా, గర్వంగా ఉన్నదని చైతన్యరెడ్డి తెలిపారు.
ఈమె తల్లిదండ్రులతో పాటు చిల్పకుంట్లలోని తాత, నానమ్మ బంధువులతో పాటు గ్రామంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొక్క సంజీవరెడ్డి చదువు, ఉద్యోగ రిత్యా వరంగల్‌లో నివాసం ఉంటుండగా వరంగల్ జిల్లా సహకార సంస్థ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. గ్రామంలో సొంత ఇల్లు, వ్యవసాయం ఉండగా నెలలో రెండు, మూడు సార్లు వచ్చి వెళుతుంటాడు.
సంజీవరెడ్డి కూతురైన చైతన్యరెడ్డి 2016లో వరంగల్ నీట్లో బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్ ద్వారా బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. కొంతకాలం తరువాత టీఎస్పీఎస్ నిర్వ హించిన పరీక్షలో ఏఈగా ఎంపికై ఇరిగేషన్ శాఖ క్వాలిటీ కంట్రోల్లో ఉద్యోగం సాధించి భువనగిరిలో పనిచేసింది. ప్రస్తుతం ఆమె మల్లన్నసాగర్లో బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
ఇదిలా ఉంటే చైతన్యరెడ్డికి చిన్నతనం నుంచి సివిల్స్ కొట్టాలని లక్ష్యం పెట్టుకొని చదువుతూ ఉండేదని చైతన్యరెడ్డి తండ్రి సంజీవడ్డి తెలిపారు. గతంలో రెండు సార్లు సివిల్స్ రాయగా కొద్ది మార్కులతో మిస్ కాగా ఈ సారి పట్టుదలతో చదివి 161వ ర్యాంకు సాధించి లక్ష్యాన్ని చేరుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చైతన్యరెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్ లో మాట్లాడుతూ తాను ఐఏఎస్, ఐపీఎస్ కావాలనే గోల్ పెట్టుకున్నానని తెలిపింది.
అనూహ్యంగా తనకు వచ్చిన ర్యాంకుతో ఐపీఎస్ వచ్చే అవకాశం ఉన్నందున ఎంతో సంతోషం, గర్వంగా ఉందని ప్రజాసేవలో ఐఏఎస్, ఐపీఎస్ రెండూ ఈక్వల్ అని చెప్పింది. ప్రజలకు సేవ చేసి వారి అభిమానాన్ని పొందుతానని పేర్కొంది. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపింది. కాగా చైతన్యరెడ్డికి సివిల్స్ రావడంపై చిల్పకుంట్లలో తాత ముత్తారెడ్డి, నానమ్మ వెంకమ్మలతో పాటు బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలగిరి, మే 30 : తిరుమలగిరి మండలం సిద్ధిసముద్రం తండాకు చెందిన గిరిజన విద్యార్థి ధరావత్ సాయిప్రకాశ్ సివిల్స్‌లో 650 ర్యాంకు సాధించారు. తండ్రి ధరావత్ రవీందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా జగదేవ్‌పూర్‌లో పనిచేస్తున్నాడు. రవీందర్‌కు కుమార్తె, కుమారుడు ఉన్నా రు. సాయి ప్రకాశ్ పదో తరగతి వరకు జగదేవ్‌పూర్‌లో, ఇంటర్, డిగ్రీ నారాయణ విద్యాసంస్థలో చదివాడు. అక్కడే సివిల్స్‌కు ప్రిపేరవుతూ ఢిల్లీలో 6 నెలల సివిల్స్‌కు కోచింగ్ తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 650 ర్యాంకు సాధించాడు. దాంతో బంధువులు, తండా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిసముద్రంలో బంధువులు స్వీట్లు పంపినీ చేసుకున్నారు.
సాయి ప్రకాశ్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే వాడని అతడి తండ్రి ధరావత్ రవీందర్ తెలిపాడు. మేము కూడా అతడిని చదువుకు అన్ని విధాలా సహకరించి ప్రోత్సహించాం. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 650 ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉన్నది.