నల్లగొండ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నల్లగొండ పర్యటనకు రానున్నట్లు తెలిసింది. జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, సమీక్షించనున్నట్లు సమాచారం. ఆ మేరకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి త్వరలో సీఎం కేసీఆర్ నల్లగొండకు వచ్చే అవకాశం ఉందంటూ సోమవారం జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ బహిరంగ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 4న మెడికల్ కాలేజీ భవన శంకుస్థాపనకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి భూమి పూజ చేయాల్సి ఉంది. కాగా, మెడికల్ కాలేజీ భవనానికి సీఎం కేసీఆర్ స్వహస్తాలతో భూమిపూజ చేయవచ్చని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి వచ్చాక దీనిపై మరింత స్పష్టత రానున్నదని సమాచారం.
నల్లగొండ ప్రతినిధి, మే30 (నమస్తే తెలంగాణ) : నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షతో పాటు మెడికల్ కాలేజీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్ రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై మరింత స్పష్టత వచ్చేందుకు ఒకటి రెండు రోజుల సమయం పట్టవచ్చని తెలుస్తున్నది. నల్లగొండలో ప్రధాన రహదారుల విస్తరణ, జంక్షన్ల ఆధునీకరణ, పార్కుల సుందరీకరణ, నల్లగొండ కళాభారతి నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు, హెలిప్యాడ్, అధునాతన ఆర్అండ్బీ అతిథిగృహం నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. గత డిసెంబర్ చివరల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తండ్రి మారయ్య పెద్దకర్మలో పాల్గొనేందుకు నల్లగొండకు వచ్చిన సీఎం కేసీఆర్ అభివృద్ధిపై సమీక్షించారు. గడువు మేరకు పనులను ప్రారంభించి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇగత నెలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ దశదినకర్మలో పాల్గొనేందుకు నార్కట్‌పల్లికి వచ్చిన సందర్భంగానూ సీఎం కేసీఆర్ నల్లగొండ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షించారు.
మరిన్ని అభివృద్ధి పనులు సైతం మంజూరయ్యాయి. వీటన్నింటితో పాటు నల్లగొండలోని ఎస్ఎల్బీసీలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 4వ తేదీన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హారీశ్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ప్రస్తుతం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సారథ్యంలో అధికారులు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.
అయితే సోమవారం సాయంత్రం వరకు ఉన్న సమాచారం మేరకు సీఎం కేసీఆర్ నల్లగొండ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. కేసీఆర్ పర్యటన ఖరారైతే మరికొద్ది రోజుల ఆలస్యంగానైనా సరే మెడికల్ కాలేజీ భవనానికి సీఎం చేతుల మీదుగానే భూమిపూజ జరిపించాలని ఎమ్మెల్యే భావిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ త్వరలో నల్లగొండకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించారు.
సోమవారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నల్లగొండ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులను ఆహ్వానించగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమావేశంలో భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ త్వరలోనే నల్లగొండకు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
కేసీఆర్ పర్యటన ఖరారైతే భారీ బహిరంగసభకు కూడా సిద్ధంగా ఉండాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఎప్పుడు సభ నిర్వహించాల్సి వచ్చినా గతంలో ఎన్నడూ లేని విధంగా జనసమీకరణ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా నల్లగొండ అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అనేక విషయాలను ఎమ్మెల్యే వివరించారు.
గత 20 సంవత్సరాలుగా నల్లగొండ అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. కానీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు సీఎం కేసీఆర్ నల్లగొండ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని వివరించారు. నల్లగొండ రూపురేఖలు మార్చాలంటూ గత డిసెంబర్లో ప్రకటించిన మాదిరిగానే అనేక పనులు ఏకకాలంగా జరుగుతున్నాయని తెలిపారు.
కేసీఆర్ ప్రత్యేక ప్రేమతోనే నల్లగొండలో ఊహించని విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్కడా జాప్యం లేకుండా నిరంతరం కేటీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షలు చేస్తూ ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. గతంలో ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యే మర్రిగూడ బైపాస్ రోడ్డు జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మించలేకపోయారని విమర్శించారు. దాని కారణంగా అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. త్వరలోనే మర్రిగూడ బైపాస్‌తో పాటు పానగల్ జంక్షన్‌లోనూ రెండు ఫ్లైఓవర్లు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు.
ప్రస్తుతం 110 కోట్లతో ఎస్ఎల్బీసీ వద్ద 42 ఎకరాల్లో మెడకిల్ కళాశాల శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ముందు ప్రకటించిన మేరకు మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని..అయితే తాజా సమాచారం మేరకు సీఎం కేసీఆర్ స్వయంగా మెడికల్ కళాశాల శంకుస్థాపనకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసిందని వెల్లడించారు. సీఎం రాకపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.
ఒకవేళ నల్లగొండ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తానంటే నల్లగొండ ప్రజల అదృష్టంగా భావించి గతంలో ఎన్టీఆర్ కంటే భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధమేనని ఎమ్మెల్యే కంచర్ల ప్రకటించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు కోరుకున్న మార్పునకు అహర్నిశలు కృషి చేస్తున్న నల్లగొండ అభివృద్ధిపై లేదా వ్యక్తిగతంగా తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండడం బాధాకరమన్నారు. దీనిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, ఎంపీపీలు కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి, జడ్పీటీసీ చిట్లా వెంకటేశం, నాయకులు చీర పంకజ్ యాదవ్, వంగాల సహదేవ్‌రెడ్డి, దేపవెంకట్రెడ్డి, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, ఐతగోని యాదయ్య, రూప, కొండ్ర స్వరూప, రొట్టేల రమేశ్, మామిడి పద్మ, కృష్ణయ్య పాల్గొన్నారు.