యాసంగి వడ్ల కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో సంపూర్ణంగా ముగుస్తున్నాయి. సోమవారం నాటికి 99 శాతం కొనుగోళ్లు కాగా, నేటితో మిగిలిన ఒక్క శాతం పూర్తికానున్నది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు కూడా అంతే వేగవంతంగా చేస్తున్నారు. కొనుగోళ్లు పూర్తి చేసిన జిల్లాల్లో రాష్ట్రంలోనే నల్లగొండ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో రూ.629.68 కోట్ల విలువైన 3.21లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు.
పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికే 214 కేంద్రాలను మూసివేయగా మిగిలిన సెంటర్లలో మరో 1,991 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. వాటిని కూడా మంగళవారం పూర్తి చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు ససేమిరా అన్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ అభయమిచ్చి, అండగా నిలిచి 45 రోజుల్లోనే పూర్తి చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మే30 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టాలని కుట్రలు పన్నిన విషయం విదితమే. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర సర్కారుపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు. అయినా కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిలో మార్పు రాలేదు.
దాంతో రాష్ట్ర రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వెంటనే అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. వెనువెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టారు.
నల్లగొండ జిల్లాలో గత నెల 15వ తేదీ నుంచి నిరాటకంగా కొనుగోళ్లను జరిపారు. జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ పర్యవేక్షణలో జిల్లా పౌరసరఫరాల అధికారి వి.వెంకటేశ్వర్లు, సంస్థ మేనేజర్ నాగేశ్వర్రావు కొనుగోళ్లను ముందుకు నడిపించారు. జిల్లా రైస్‌మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్, తూనికలు కొలతల అధికారులు, సిబ్బందితో కలిసి హమాలీలు, ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లతో సమన్వయం చేస్తూ కొనుగోళ్లను వేగంగా పూర్తి చేశారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలో 248 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఐకేపీ ద్వారా 128 కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా 112, మార్కెట్ కమిటీల ద్వారా 8 కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా రెండు, మూడు గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. దాంతో రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించారు.
సుమారు 45 రోజుల పాటు నిర్విరామంగా కొనుగోళ్లు జరిపారు. సోమవారం నాటికి మొత్తం 3,21,263 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో 3.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించారు. మధ్యలో అకాల వర్షాలతో అక్కడక్కడ తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనుగోలు చేస్తూ రైతులకు నష్టం జరుగకుండా జాగ్రత్త వహించారు. ఈ సీజన్లో వ్యవసాయశాఖ అధికారులు మాత్రం 5.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేసినా..అంతా ధాన్యం రాలేదు.
మరో 1991 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చి ఉండగా దానిని నేడు కొనుగోలు చేయనున్నారు. పూర్తిస్థాయి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేశారు. దాంతో మొత్తం 629.68 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని 54,308 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. వీరికి చెల్లింపులు కూడా వెంటనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. వారం నుంచి పది రోజుల లోపే ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత విభాగాల అధికారులను సమన్వయం చేస్తూ కొనుగోళ్లను ముందుకు సాగించారు.
కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తూ చెల్లింపులు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 629.68 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా సోమవారం నాటికి 455.35 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎంట్రీ చేశారు. మరో రూ.174.33 కోట్ల ధాన్యాన్ని ఎంట్రీ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 32,383 మంది రైతులకు రూ.411.28కోట్ల రూపాయల చెల్లింపులను పూర్తి చేశారు.
మిగిలిన వాటిని వారం రోజుల్లోపే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఫలితంగా అనుకున్న దాని కంటే ముందుగానే ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయగలిగామని జిల్లా పౌరసరఫరాల అధికారి వూర వెంకటేశ్వర్లు తెలిపారు.
జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ పీజే పాటిల్, ఎమ్మెల్యేలు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సహకారంతోనే ఇంత త్వరగా సాధ్యమైందని పేర్కొన్నారు. మిగిలిన వాటిని మంగళవారంతో పూర్తి చేసి, చెల్లింపులపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ప్రకటించారు. కొనుగోళ్లకు సహకరించిన రైతులతో పాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.