బొడ్రాయిబజార్, మే 30 : దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాదిగలకు శత్రువులని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ఏర్పాటు చేసిన నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అథిధిగా హాజరై మాట్లాడారు. దేశాన్ని గతంలో పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ మాదిగలను మోసం చేశాయన్నారు.
దేశవ్యాప్తంగా దళితులపై దాడులు చేసిన చరిత్ర బీజేపీదేనని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతామని చెప్పి బీజేపీ మాట దాటవేసిందన్నారు. ప్రస్తుతం శ్రీరామ్ అని అనకుంటే దళితులపై దాడులు చేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితులపై దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని గ్రామాల్లో తిరుగనిచ్చేది లేదన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దళితుడికీ దళితబంధు పథకాన్ని ఇవ్వాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించి చెప్పు, డప్పు కార్మికులకు పింఛన్ అందించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ కోసం టీఎమ్మార్పీ ఎస్ భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. సమావేశంలో నాయకులు మరికంటి అంబేద్కర్, పడిదల రవికుమార్, చింతబాబు, పల్లేటి లక్ష్మణ్, పరశురాములు, మేదరి ప్రసాద్, శోభ పాల్గొన్నారు.