యాదాద్రి, మే 30 : నాటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్ మడమ తిప్పని ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. గతంలో ఇంద్రారెడ్డి నాయకత్వం వహించిన రాష్ట్ర సాధనోద్యమంలో కాంగ్రెస్ నాయకులు ఎందుకు మడమతిప్పారో చెప్పాలని సవాల్ విసిరారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడారు.
సమైక్య పాలనలో ఎడారిగా ఉన్న తెలంగాణ నేడు అన్నపూర్ణగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్‌సీఐ ప్రకటన ప్రకారం.. వరి దిగుబడిలో దేశంలో పంజాబ్‌ది మొదటి స్థానమైతే, తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో గత యాసంగిలో 91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేవలం 21లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని ఎఫ్‌సీఐ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
వరి దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న మధుయాష్కీ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎడారిగా మారి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే టీఆర్ఎస్ పాలనలో వడ్ల ధాన్యాగారంగా మారిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కితాబిచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయులు ఒక్కసారి ఆలోచించాలని కోరారు.