ఉమ్మడి ఏడారిని తలపించిన నేల సూర్యాపేట. సాగునీటి వనరుల్లేక ఇక్కడి రైతాంగం దశాబ్దాల తరబడి తండ్లాడింది. వరుణుడు కరుణించి వర్షాకాలంలో వరద పోటెత్తినా కండ్ల ముందే వాగుల్లో వృథాగా పోయేది తప్ప, చుక్క నీరు నిలువక పోయేది. కారణం! పట్టించుకునే పాలకుల్లేక!! స్వరాష్ట్రంలో కాళేశ్వరం జలాలు, మూసీ ప్రవాహంతో కరువు ఛాయలను తుడిపేసుకున్న సూర్యాపేట జిల్లాలో నేడు నీటి చుక్క అన్నదే వృథా అవడం లేదు. వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో మూసీ, పాలేరు వాగులపై రూ.242 కోట్లతో నిర్మిస్తున్న 39 చెక్ డ్యామ్‌ల్లో 15 వరకు ఇప్పటికే పనులు పూర్తిచేసుకుని నడి వేసవిలోనూ కళకళలాడుతున్నాయి. చుట్టుపక్కల రెండు, మూడు కిలోమీటర్ల మేర భూగర్భజలాలు పెరిగినట్లు రైతులు సంతోషంగా చెప్తున్నారు. మిగతా చోట్ల పనులు కొనసాగుతున్నాయి.
సూర్యాపేట, మే 28 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిని తలపించిన సూర్యాపేట ప్రాంతం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చొరవతో సస్యశ్యామలం అవుతున్నది. 2014 నుంచి ఇప్పటి వరకు తాగునీటికి ఇక్కట్లు వచ్చినా.. సాగు నీటికి ఆటంకాలు ఏర్పడినా.. నాగార్జునసాగర్ కాల్వల వెంట తిరిగి నీటిని తీసుకురావడం, మూసీకి కృష్ణాజలాలు తెచ్చి సూర్యాపేట దాహర్తిని తీర్చడం.. ఏటి వెంట బావులను తవ్వించి ఆత్మకూర్.ఎస్ మండల దాహార్తిని తీర్చిన విషయం విదితమే. సూర్యాపేటకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు రావడం, మూసీ ఆధునీకరణతో ఆయకట్టు స్థిరీకరణ జరుగడంతోపాటు వాగుల్లో దిగువకు వృథాగా పోతున్న నీటిని సైతం ఉపయోగించుకోవాలనే ఆలోచన చేశారు.
సూర్యాపేట కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పలు అభివృద్ధి పనులను సీఎం ముందుంచారు. అంతకు ముందు మంత్రి ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరులో పర్యటించగా.. కానాల మల్లారెడ్డితోపాటు కొంతమంది రైతులు పాలేరు వాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే బాగుంటుందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆ విషయాన్ని మంత్రి సీఎం కేసీఆర్ ముందుంచడం, ముఖ్యమంత్రి వెంటనే నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ మేరకు జిల్లాకు విడుతల వారీగా రూ.242 కోట్ల వ్యయంతో 39 చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యాయి.
సూర్యాపేట, హుజూర్నగర్ నియోకవర్గాల పరిధిలోని మూసీ వాగుపై 19 చెక్‌డ్యామ్‌లు మంజూరు కాగా, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని బిక్కేరు వాగుపై 3, పాలేరు వాగుపై 12, తెట్టెవాగుపై 2, వేములూరు వాగుపై 3 మంజూరయ్యాయి. అధికారులు వెంటనే రంగంలోకి దిగి వాగులపై సర్వే చేపట్టి అనువైన ప్రదేశాలను గుర్తించి ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచారు.
ఆయా ప్రాంతాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పనులను ప్రారంభించగా సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే సూర్యాపేట నియోకవర్గంలో పనులు పూర్తయినచోట వాటి ఫలితాలు నేడు దర్శనమిస్తూ జలకలను సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు 15 చెక్‌డ్యామ్‌లు వంద శాతం, మిగిలినవి 40 నుంచి 60 శాతం పూర్తి కాగా, కొన్ని ఇటీవలే పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి అన్నీ పూర్తి చేస్తామని ఇరిగేషన్ ఈఈ భద్రూనాయక్ తెలిపారు.
గతేడాది పనులు ప్రారంభమైన చెక్‌డ్యామ్‌లు దాదాపు 90 శాతం పూర్తవడంతో జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే వంద శాతం పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు, అనేక సార్లు మూసీ గేట్లు ఎత్తడం ద్వారా నీటి ప్రవాహంతో పనులకు ఆటంకాలు కలిగాయి. తొలి విడుతలో పాలేరు వాగుపై మొత్తం 12, మూసీపై 19 చెక్‌డ్యామ్‌లు మంజూరవగా వాటిలో దాదాపు 70 శాతం పూర్తయి మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా పాలేరు వాగుపై ఏపూరు, బొప్పారం-లింగంపల్లిబాట, మిడతనపల్లి, గంగమ్మదేవాలయం(మిడతనపల్లి), మక్తాకొత్తగూడెం, గౌస్తండాబాట, మక్తాకొత్తగూడెం(గంగమ్మ ఏనె కింద), చాకలిబండ(ఏపూరు), గుండ్లసింగారంబాట వద్ద నిర్మాణాలు పూర్తి కావడంతో చెక్‌డ్యామ్‌లు చెరువుల్లా మారి భూగర్భజలాలు పైపైకి ఉబికి వస్తున్నాయి. ఒక్కో చెక్‌డ్యామ్ చుట్టూ దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర భూగర్భజలాలు పెరుగడంతో ఆయా ప్రాంతాల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏటిలో చెక్‌డ్యామ్‌లు నిర్మించడం ద్వారా కండ్ల ముందు నీరు ఉండడంతో తనివి తీరా వరి సాగు చేస్తున్నాం. గత ప్రభుత్వాల హయాంలో వర్షం వచ్చినప్పుడు ఏటిలో నీరంతా వృథాగా వెళ్లి పాలేరులో కలిసేది. నాకు వాగు పక్కనే భూమి ఉన్నా నీరు అందక అల్లాడిపోయేవాళ్లం. సాగు నీటి కోసం ఏటిలో చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలకు రైతులు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఏపూరు వాగులో 7 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చారు. చెక్‌డ్యామ్‌ల ఏర్పాటుతో బోర్లు, బావుల్లో భూగర్భజలాలు పెరిగి రెండు కార్లు పంటలు పండిస్తున్నాం. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం.
-కానాల మల్లారెడ్డి, రైతు, ఏపూరు
ఎన్నో ఏండ్లుగా ఏటి పక్కనే భూములున్నా నీరు లేక పంటలు సాగు చేయలేకపోయాం. వానకాలం ఏటిలో నీరు ఉన్నా కొద్ది రోజులకే అవి కనబడకుండా పోయేవి. నాకు ఉన్న ఐదెకరాల్లో ఎకరం మాత్రమే సాగు చేసేవాడిని. చెక్‌డ్యామ్ ఏర్పాటుతో చుట్టుపక్కల ఉన్న బోర్లు, బావుల్లో భూగర్భజలాలు పెరుగడంతో ఈ సంవత్సరం ఐదెకరాలు సాగు చేశాను. ఒకప్పుడు అప్పు చేసి వ్యవసాయం చేసేవాళ్లం, ఇప్పుడు వ్యవసాయం చేసి మేమే అప్పులు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు.
-సాని గురువయ్య, రైతు, మక్తాకొత్తగూడెం
