అది నిజాం వ్యతిరేక ఉద్యమానికి ఊపిరిలూదిన గ్రామం. మలి దశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన నేల. ఆ గడ్డపై 2006లో ఓ స్వచ్ఛంద గ్రంథాలయం పురుడు పోసుకుంది. స్నేహితుల సహకారంతో మొదలై నేడు ఎంతో మంది పాఠకులకు విజ్ఞానం, ఉద్యోగార్థులకు కావాల్సిన సమాచారం అందిస్తున్నది. అదే చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రంథాలయం.
-చిట్యాల, మే 28
స్నేహితులు తమ గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొదటి విరాళంగా రూ.500 చొప్పున రూ.12వేలు సమకూర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వేలాది పుస్తకాలు, ఫర్నిచర్ సేకరించారు. యువకుల ప్రోత్సాహాన్ని చూసిన సర్పంచ్ చెరుకుపల్లి చంద్రయ్య గ్రంథాలయం కోసం పంచాయతీ కార్యాయంలో ఓ గదిని కేటాయించారు. ఏప్రిల్ 14, 2006న విద్యావేత్త చుక్కా రామయ్య, నాటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాదె వినోద్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రంథాలయంలో 12 దిన పత్రికలు, 30 మ్యాగజైన్లు, 20 పైగా వివిధ రకాల పోటీ పరీక్షల పుస్తకాలతోపాటు మహనీయుల జీవిత చరిత్ర, సాహిత్య పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచారు. వీటి నిర్వహణ ఖర్చంతా కమిటీ సభ్యులే భరిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంటుంది.
ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని ఇప్పటి వరకు 22 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మరో 35 మంది ఉన్నత విద్యను అభ్యసించి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రంథాలయం వారోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రంథాలయం అభివృద్ధికి ఎంతో మంది స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం ఉద్యోగార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. దాతల సహకారంతో దినపత్రికలతోపాటు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులో ఉంచాం. మొదటగా 16 మంది నుంచి నేడు రోజుకు 100 మంది పాఠకులు గ్రంథాలయ సేవలను వినియోగించుకుంటున్నారు. గుండ్రాపల్లితోపాటు ఇతర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు.
– అనుముల శ్రీనివాస్, గ్రంథాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు
ఈ గ్రంథాలయంలో రోజూ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలపాటు పోటీ పరీక్షల పుస్తకాలు, దినపత్రికలు చదివాను. 2010లో గ్రంథాలయంలోని ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే పత్రికలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూశా. వెంటనే దరఖాస్తు చేసి సెంట్రల్ కానిస్టేబుల్‌కి ఎంపికయ్యాను. నాకు ఉద్యోగం రావడానికి మా ఊరి గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడింది. గ్రంథాలయం నిర్వాహకులకు ధన్యవాదాలు. నిరుద్యోగ యువత గ్రంథాలయాన్ని వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి.
-గోపగోని అశోక్, సెంట్రల్ కానిస్టేబుల్, గుండ్రాంపల్లి