దామరచర్ల, మే 28 : మండలంలో కేశవాపురం లిఫ్ట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మూసీ, అన్నవేరు వాగులపై ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక్షంగా రూ.535 కోట్లు విడుదల చేశారు. వీటిల్లో రూ.75.93కోట్లతో చేపట్టే కేశవాపురం-కొండ్రపోల్ ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియ పూర్తిచేసుకొని పనులు ప్రారంభించారు. మండలంలోని కేశవాపురం పరిధి లావూరితండా వద్ద మూసినదిపై మూడో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నారు. కేతేపల్లి నుంచి దిగువవకు ప్రవహిస్తున్న మూసీ నీరు వృథాగా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఎత్తిపోతల పథకంతో వృథా నీటిని ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే 20 శాతం పనులు పూర్తయ్యాయి. నదీ తీరంలో ఇన్టెక్ వెల్, బెడ్ నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం రైతులు పొలం సాగుచేస్తున్న క్రమంలో పైపులైన్ వేసేందుకు కొంత ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు. లావూరి, మంగళదుబ్బతండా పరిధిలోని మూసీనది వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి రెండు పైపులైన్లు వజీరాబాద్ మేజర్ ఆర్-8/ఎల్2, ఆర్-8/ఎల్4 మేజర్లల్లో కలుపుతారు.
దీంతో కొండ్రపోల్, బొత్తలపాలెం, నూనావత్తండా, మాన్తండా, దనియాలతండా, జేత్రాంతండా, ఎల్బీతండా, తెట్టకుంట, మంగళతండా, లావూరితండాల పరిధిలోని 5,875 ఎకరాలు అదనంగా సాగులోకి వస్తుంది. అనుకున్న సమయానికే పనులు పూర్తిచేసి రైతులకు ఎత్తిపోతల పథకాన్ని అందిస్తామని అధికారులు చెబుతున్నారు.