నల్లగొండ రూరల్, మే 28 : జూన్ 3 నుంచి జూన్ 18 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 5వ విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, మండలాల ప్రత్యేక అధికారు లతో పల్లెప్రగతి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చూట్టిందన్నారు.
గత పల్లె ప్రగతిలో ఫలితాలను సుస్థిరపరుస్తూ 5వ విడుత చేపట్టే పల్లె ప్రగతిని విజయవంతం చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే సర్పంచులు, పంచాయాతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదట రోజు గ్రామ సభ నిర్వహించి ప్రగతి నివేదికలు తయారు చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈసారి గ్రామాలకు ఏబీసీడీ గ్రేడ్ల వారీగా మార్కులు కేటాయించి మండలంలో మూడు ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామన్నారు.
అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ గ్రామాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసి పల్లె ప్రగతిని విజయవంతం చేయాలన్నారు. మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు 5 ఎకరల భూమి చూపించాలని సూచించారు. డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు తప్పనిసరిగా వినియోగంలోకి తేవాలన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీసీఓ వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, డీఆర్డీఏ పీడీ కాళిందిని, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, వివిధ మండాలల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.