నాంపల్లి, మే 28 : మండలంలోని కేతేపల్లి గ్రామంలో శనివారం విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఇద్దరిది కేతేపల్లి కాగా, మరొకరిది గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామం. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ..గత నెలలో జరిగిన శ్రీరామనవమికి కేతేపల్లి గ్రామ శివారులో ఉన్న రాములోరి గుట్ట సమీపంలో ఘనంగా రథోత్సవం నిర్వహించారు.
అప్పటి నుంచి రథం ఆలయ సమీపంలోనే ఉంది. అయితే శనివారం గ్రామానికి చెందిన పసునూరి దయానందరెడ్డి కొందరు గ్రామస్తులతో కలిసి రథాన్ని రథశాలలో పెట్టడానికి గుట్ట వద్దకు వెళ్లాడు. రథాన్ని తరలిస్తున్న సమయంలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. రథం ఇనుముతో చేసినది కావడంతో షాక్ గురై గ్రామానికి చెందిన రాజబోయిన యాదయ్య(35), పొగాకు మోహనయ్య (40), గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు (30) మృతి చెందాడు.
ఆంజనేయులు దయానందరెడ్డి వద్ద కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. షాక్ నుంచి తెరుకున్న మిగిలిన వారు వెంటనే 108కి సమాచారం అందించారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన రాజబోయిన వెంకటయ్యను 108లో నల్లగొండ దవాఖానకు తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా దవాఖానకు తరలించారు.
దేవరకొండ : విద్యుదాఘాతంతో మృతి చెందిన వారి కుటుంబాలను దేవరకొండ ఏరియా దవాఖానలో ఎమ్మెల్యేరమావత్ రవీంద్ర కుమార్పరామర్శించారు. వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రమాదంలో మృతి చెందిన రాజబోయిన యాదయ్యది నిరుపేద కుటుంబం. గ్రామంలో వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య ముత్యాలు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త మరణంతో భార్య, చిన్నారులైన పిల్లలు బోరున విలపిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
పొగాకు మోహనయ్య వ్యవసాయం, కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య యాదమ్మ ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 20 రోజులు క్రితం పెద్ద కుమార్తె వివాహం చేశాడు. రెండో కుమార్తె ఇంటర్ చదువుతున్నది. రోజు గ్రామంలో చుట్టూ పక్కల వాళ్లను నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. ఒకే సారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి
గుర్రంపోడు : ప్రమాదంలో మృతి చెందిన ఆంజనేయులు(30) డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతోతలి సత్తమ్మ కన్నీరుమున్నీరైంది. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే ఆంజనేయులు మరణ వార్త విన్న గ్రామస్తులు కన్నీరు పెట్టారు.