సూర్యాపేట, మే 26 : జిల్లాలోని కాల్వలకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్ఎస్పీ, ఎస్సారెస్పీ, డీఆర్డీఏ, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులతో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ ఎస్పీ, ఎస్సారెస్పీ కాల్వలకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి మెగా పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు.
సత్వరమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్ఎస్పీ కాల్వలకు ఇరువైపులా 146 కిలో మీటర్ల దూరం ఉండగా 50 మీటర్ల వెడల్పులో ఒక మెగా ప్రకృతి వనం తయారు చేయాలన్నారు. ఎస్సారెస్పీ కాల్వలు ఇరువైపులా కలిపి జిల్లాలో 212 కిలో మీటర్లు ఉన్నాయని, 20 మీటర్లలో వెడల్పులో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని సూచించారు.
నిర్దేశించిన మొక్కల ప్లాంటేషన్ పనులపై సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలన్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా మొక్కల కోసం గుంతలు తీయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వేతనాల చెల్లింపులు జరుగుతాయని అన్నారు. ప్లాంటేషన్‌లో ఎక్కువగా అటవీ జాతి మొక్కలు, పండ్ల మొక్కలు నాటాలన్నారు. రానున్న హరితహారంలో జిల్లావ్యాప్తంగా 86 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 31 క్రీడా ప్రాంగణాలను గుర్తించామని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. 29 క్రీడా మైదానాలకు అంచానాలు తయారు చేసి 13 చోట్ల పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రతి మండలానికి 2 చొప్పున క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జూన్ 2 నాటికి క్రీడా ప్రాంగాణాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటి వరకు చివ్వెంల మండలంలో-2, గరిడేపల్లి-2, నూతనకల్-1, జాజిరెడ్డిగూడెం-2, కోదాడ-1, మేళ్లచెర్వు-2, మునగాల-1, నడిగూడెంలో 2 చోట్ల పనులు ప్రారంభించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్, మోహన్‌రావు, డీఎఫ్ఓ ముకుందారెడ్డి, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, కిశోర్‌కుమార్, వెంకారెడ్డి, డీఆర్డీఓ కిరణ్‌కుమార్, ఏపీడీ పెంటయ్య, నీటి పారుదల శాఖ ఎస్ఈ నాగేశ్వర్రావు, నర్సింగరావు, ఈఈ భద్రూనాయక్ పాల్గొన్నారు.
సూర్యాపేట, మే 26 : రుణదారులకు సకాలంలో రుణాలు అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 2021-22 నాలుగో త్రైమాసిక వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణ లక్ష్యం రూ.1935.57కోట్లు కాగా, రూ.1862.62 కోట్లు అందించడం జరిగిందన్నారు. 96.23 శాతం పూర్తి చేశామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రూ.408.09 కోట్ల లక్ష్యం కాగా, రూ.678.56 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు.
విద్యా రుణాలు రూ.71.99కోట్లు లక్ష్యం కాగా, 117.32 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గృహరుణాలు రూ.98.98 కోట్లకు రూ.233.47 కోట్లు, పరిశ్రమలకు రూ.381.18 కోట్లకు 339.40 కోట్లు అందించామన్నారు. జిల్లా వార్షిక రుణ లక్ష్యం రూ.4146.88 కోట్లకు గాను రూ.4457.85 కోట్లు అందించి 107.50 శాతం టార్గెట్ చేరుకోవడం జరిగిందని తెలిపారు. ముద్ర రుణాలు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీపై అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని సూచించారు. అనంతరం 2022-23 వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.