గాలులతో పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. కనగల్, చందంపేట, దేవరకొండ మండలాల్లో చెట్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పైకప్పు రేకులు ఎగిరి పోయి ఇండ్లు, కోళ్ల ఫారాల షెడ్లు దెబ్బతిన్నాయి. తిరుమలగిరి సాగర్లో గోడ కూలి వ్యక్తి మృతిచెందాడు.
దేవరకొండ/దేవరకొండ రూరల్/ చందంపేట / కనగల్, మే 26 : నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా మబ్బులు కమ్మి భారీ శబ్ధంతో ఉరుములు ఉరిమాయి. దేవరకొండ మండలంలోని వైదోనివంపు, చింతబావి, తాటికోల్, మంగలోనిబావి, కొమ్మేపల్లి గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు కూలిపోయాయి.
ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపోయాయి. చింతబావిలో పౌల్ట్రీషెడ్డు రేకులు ఎగిరిపడి కోళ్లు మృత్యువాతపడ్డాయి. గ్రామపంచాయతీ ట్రాక్టర్ ట్రాలీపై చెట్టు పడడంతో స్వల్పంగా దెబ్బతింది. చందంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలుల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దాంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కనగల్ మండలంలోని కురంపల్లి, రేగట్టె, శాబ్దుల్లాపురం గ్రామాల్లో గాలి దుమారంతో కూడిన వర్షం కురిసింది. గాలివానకు శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కారింగు చంద్రయ్య ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోనూ గంట పాటు వర్షం కురిసింది.