మిర్యాలగూడ రూరల్, మే 25 : వానకాలం పంటల సాగు చేసే ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ సీహెచ్. కృష్ణవేణి తెలిపారు. బుధవారం మిర్యాలగూడ పట్టణ శివారులో ఉన్న తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. వరి సన్న, దొడ్డు రకాలతో పాటు వేరుశనగ, పెసర, జీలుగు, జనుము, పిల్లిపెసర విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో జీలుగు విత్తనాలకు మాత్రమే సబ్సిడీ ఉందని మిగిలిన వాటికి లేదని పేర్కొ న్నారు. కలెక్టర్ ఆమోదం మేరకు పీఏసీఎస్, ఆగ్రో రైతు సేవా కేంద్రం, డీసీఎంఎస్లకు విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్ గల డీలర్లు విత్తనాలను తీసుకెళ్లి రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. వానకాలంలో రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
