చిట్యాల, మే 25 : రైతులు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం చిట్యాల పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా, రైతుల తరఫున ఢిల్లీలో దీక్ష చేసినా పట్టించుకోలేదన్నారు.
కేంద్రం మొండి వైఖరి ప్రదర్శించడంతో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవతంగా కొనుగోళ్లు చేస్తుందన్నారు. కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దని సూచించారు. ఇప్పటి వరకు 5 లక్షల మంది రైతుల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.6వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు.