ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని, ఎన్నో ఏండ్లుగా నివసిస్తున్నా ఎలాంటి గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. జీఓ 58 ప్రకారం 125 గజాల్లోపు ఇండ్లను ఏ అభ్యంతరం లేకుండా ఉంటే ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టింది. సర్కారు ఆదేశాలతో జిల్లా అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో 4,574 మంది ఇండ్ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే దరఖాస్తుచేసుకున్నారు.
వాటిని పరిశీలించేందుకు మంగళవారం సర్వే ప్రారంభించారు. పది రోజులపాటు సర్వే కొనసాగనుండగా క్రమబద్ధీకరించే ఇండ్ల ఫొటోలు, వివరాలు తీసుకొని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఉన్నతాధికారుల నిర్ణయంతో పట్టాతో కూడిన సర్టిఫికెట్ అందించనున్నారు. వీటి తర్వాత 125 గజాలపైన ఉన్న ఇండ్లను 59 జీఓ ద్వారా క్రమబద్ధీకరించనున్నారు.
నల్లగొండ, మే 24 : వివాదాల్లో లేని ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఏండ్ల తరబడి నివాసముంటున్న పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాటిని పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన సర్వే కొనసాగుతున్నది. ఈ సర్వే పారదర్శకంగా నిర్వహించి అర్హులకే పట్టాలు ఇచ్చేందుకు వీలుగా జిల్లా అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
జిల్లా వ్యాప్తంగా 24 బృందాలు పని చేస్తుండగా బృందంలో జిల్లాస్థాయి అధికారి, ఆర్ఐ, వీఆర్ఓ, వీఆర్ఏలు ఉన్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన సర్వే వచ్చే నెల 5వరకు కొనసాగనున్నది. 125 గజాల లోపు ఇండ్లు కట్టుకున్న వారి దరఖాస్తులు మాత్రమే పరిశీలిస్తారు. అంతకు మించి ఉంటే వాటిని జీఓ 59కి మారుస్తారు.
జీఓ 58 కింద దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్ల నిర్మాణాలపై సర్వే చేసి పరిశీలించిన అంశాలను ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్‌లో నమోదు చేయనున్నారు. జిల్లా, మండలం, గ్రామం, డోర్ నంబర్, ఆదాయ వివరాలు, వృత్తి, భూమి వివరాలు, ఇల్లు ఫొటో, నివాస కాలం, ఆధారం నంబర్, పెండింగ్ సమస్యలు వంటివి పరిశీలించి యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. 125 గజాల లోపు ఉంటే ఇందులో నమోదు చేస్తారు, అంతకు మించి ఉంటే 59 జీఓ కింద పొందుపర్చి దానిని పెండింగ్‌లో ఉంచుతారు. గ్రామీణ ప్రాంతాల వారికి ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలలోపు ఆదాయం ఉన్న వారు మాత్రమే అర్హులుగా గుర్తిస్తారు.
నల్లగొండ జిల్లాలో 4,574 మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయా మండలాల్లో 4,19,145 స్కేర్ యార్డుల భూమి జీఓ నంబర్ 58 కింద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా దరఖాస్తులను సర్వే బృందాలు పరిశీలించి సర్వే చేయనున్నాయి. నల్లగొండ రెవెన్యూ డివిజన్లో 9, మిర్యాలగూడలో 10, దేవరకొండ రెవెన్యూ డివిజన్లో 5 బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. అభ్యంతరకరమైన భూములైన అసైన్డ్ భూములు, కంటోన్మెంట్, రిజర్వ్ ఫారెస్ట్, కోర్టు కేసు ఉన్నవి, వెకెంట్ లాండ్స్, అలైన్మెంట్ ఆఫ్ ఎంఆర్టీఎస్ లేదా మెట్రో రైల్వే భూములు, కుంటలు, ట్యాంకులు, నదులకు సంబంధించినవి, ఎఫ్టీఎల్ భూముల్లో నిర్మించిన ఇండ్లను పరిగణలోకి తీసుకోరు.
నందికొండ : జీఓ 58, 59 కింద ఇండ్ల హక్కు దారుల గుర్తింపుకోసం నందికొండలో హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం బుధవారం సర్వే నిర్వహించింది. దరఖాస్తు దారుల నుంచి వివరాలు సేకరించింది. ధ్రువపత్రాలు పరిశీలించింది. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఇండ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారు 2014 కంటె ముందు నుంచి ఇంట్లో నివాసముంటున్నట్లు ధ్రువీకరణతో పాటు ఇంటి పత్రాలు ఉండాలని, కరెంట్ బిల్లు, ఓటర్ కార్డు వంటి వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివరాలను సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. సర్వేలో ఆయనతో పాటు పెద్దవూర ఆర్ఐ లక్ష్మీకాంత్, వీఆర్వో నిరంజన్ ఉన్నారు.
అభ్యంతరం లేని 125 గజాల లోపు భూమిలో నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లను క్రమ బద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ 58 జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 4,574 దరఖాస్తులు రాగా 24 బృందాలతో సర్వే చేయిస్తున్నాం. ప్రతి బృందం 250 దరఖాస్తులు సర్వే చేసి ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేస్తుంది. అర్హులను గుర్తించి ప్రభుత్వం పట్టా సర్టిఫికెట్ అందజేస్తుంది. సర్వే బృందం లీడర్‌గా జిల్లాస్థాయి అధికారిని నియమించాం.
– జగదీశ్వర్‌రెడ్డి, డీఆర్వో, నల్లగొండ