చౌటుప్పల్, మే 23 : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెం గ్రామ శివారులో ఉన్న మెట్లబావి మెరిసిపోతోంది. దీనిని అందంగా తీర్చి దిద్ది పర్యాటక ప్రాంతంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు హెచ్ఎండీఏ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 400 ఏండ్ల నాటి ఈ బావి.. ఆనాడు అనేక రాష్ర్టాల ప్రజల దాహార్తిని తీర్చడంతోపాటు ఈ ప్రాంతానికి సాగు నీరందించింది.
కానీ గతంలో దీని గురించి పట్టించుకునే వారు కరువవడంతో ఉనికిని కోల్పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చరిత్రను, అందుకు సాక్షులుగా నిలుస్తున్న కట్టడాలను వెలికి తీసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మెట్లబావిని సుందరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.
మెట్ల బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వడివడిగా పనులు కొనసాగుతున్నాయి. బావి లోపల, బయటి పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించారు. బావి చుట్టూ అల్లుకున్న ఎత్తైన చెట్లను తొలగించారు. ముందు భాగంలో గేటు, చుట్టూ ప్రత్యేకమైన కంచెను ఏర్పాటు చేశారు.
పచ్చిక బయళ్లను ఏర్పాటు చేశారు. బావిలోపల భాగంలోని రాతికట్టడానికి విద్యుత్దీపాలను అమరుస్తున్నారు. గత వైభవాన్ని చాటిచెప్పేలా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మెట్లబావికి పూర్వవైభవం తీసుకొస్తుండడంతో పురావాస్తు పరిశోధకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.