మిర్యాలగూడకు చెందిన పదో తరగతి విద్యార్థి బి.గౌతమ్ వారం కిందట రోడ్డుప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. నడుము, కాలుకు శస్త్రచికిత్స చేయడంతో బెడ్‌రెస్ట్‌లో ఉన్నప్పటికీ పరీక్ష రాయాలని నిశ్చయించుకున్నాడు. విషయం డీఈఓ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అనుమతితో అంబులెన్స్‌లోనే బకల్‌వాడీ స్కూల్ సెంటర్‌కు చేరుకుని అంబులెన్స్‌లో ఉండే పరీక్ష రాశాడు.

కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఇడుకోజు లలిత తండ్రి పురుషోత్తమాచారి అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించారు. మల్లేపల్లి జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న లలిత పుట్టెడు దుఃఖాన్నిదిగమింగుతూ మల్లేపల్లిలోని గురుకుల పాఠశాలలో మంగళవారం ఉదయం పరీక్ష రాసింది.

విధి పెట్టిన పరీక్షకు వెరువక ఆత్మైస్థెర్యంతో తొలి అడుగు వేశారు ఈ విద్యార్థులు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తోడు రాగా, విద్యార్థులు ఆయా సెంటర్లకు చేరుకున్నారు. మొత్తం 19,907 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, తొలిరోజు 171మంది గైర్హాజరయ్యారు. 9గంటల తర్వాత సెంటర్లకు చేరుకున్న వారు ఉరుకులు పరుగులు తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ పమేలాసత్పతి, నల్లగొండలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈఓ బి.భిక్షపతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. వసతులను పరిశీలించారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగించారు.
రెండేండ్ల తర్వాత నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎక్కడా ఏ ఇబ్బందిలేకుండా తొలిరోజు తెలుగు పరీక్ష సజావుగా జరిగింది. కేంద్రాలకు సమయానికి రావాలని విద్యార్థులు ఉరుకులుపరుగులు పెట్టారు. వారి తల్లిదండ్రులు కూడా కేంద్రాలకు రావడంతో సందడిగా మారాయి. ఐదు నిమిషాలుఆలస్యంగా వస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని విద్యాశాఖ ముందస్తుగానే తెలియజేయడంతోఎవరూ ఆలస్యంగా రాలేదు. నల్లగొండ జిల్లాలో 19,907 మంది విద్యార్థులకు 19,736 మంది హాజరు కాగా 171మంది గైర్హాజరయ్యారు. సూర్యాపేట జిల్లాలో 12,616 మంది విద్యార్థులకు 12,484 మంది హాజరుకాగా132మంది గైర్హాజరయ్యారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్, సందీప్ హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల(డైట్), డీవీకే రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. డీఈఓ బి. భిక్షపతి 10 పరీక్ష కేంద్రాలను, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ హుస్సేన్ మూడు, ఫ్లయింగ్ స్వాడ్స్ బృంద సభ్యులు 38 కేంద్రాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేటలో డీఈఓ అశోక్, జాయింట్ కలెక్టర్ మోహన్‌రావు, ఉమ్మడి జిల్లా స్థాయి పదో తరగతి పర్యవేక్షకులు వెంకట నర్సమ్మ పలు కేంద్రాలను పరీశీలించారు.
కోదాడటౌన్, మే 23 : కోదాడ పట్టణంలో తెలుగు పేపరుకు బదులు సంస్కృతం పేపర్ ఇవ్వండంతో 35 మంది విద్యార్థులు ఖంగుతిన్నారు. హాల్ టికెట్లో సంస్కృతం సబ్జెక్ట్ అని నమోదు కావడంతో పరీక్ష నిర్వాహకులు సంస్కృతం పేపర్‌ను ఇచ్చారు. పాఠశాల పంపించిన ఆప్షన్ల ప్రకారమే పేపర్ వస్తుందని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. చివరికి కొంత మంది విద్యార్థుల నుంచి డిక్లరేషన్ తీసుకుని సంస్కృతం బదులుగా తెలుగు పేపర్‌ను రాయించారు.
పట్టణానికి చెందిన ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారికి చెందిన మరో పాఠశాలకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. ఈ బదిలీ కారణంగా తెలుగు బదులుగా సంస్కృతం పేపర్ ఆ విద్యార్థులకు రావండతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫార్వర్డ్ చేసిన పాఠశాలలో విద్యార్థులు తెలుగుకు బదులుగా సంస్కృతం క్లాసులు వినడంతోటే సమస్య ఏర్పడిందని సమాచారం. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన సదరు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.