నల్లగొండ ప్రతినిధి, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : గ్రామ స్థాయిలో పరిష్కరించే సమస్య మొదలు జిల్లా స్థాయి వరకు అన్నింటికీ ఒక్కటే మంత్రం అన్నట్లుగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి ప్రజలు ఇప్పటి వరకు బారులు దీరేవారు. ఇది సామాన్య ప్రజలకు ఎన్నో వ్యయప్రయాసాలకు గురిచేసింది. పైగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో మెజార్టీ వాటికి అతీగతి ఉండేది కాదు. దీంతో అధికార యంత్రాంగం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే పరిస్థితులు తలెత్తుతున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ ఇటీవలే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సి.నారాయణరెడ్డి.. జిల్లా పాలనాధికారిగా ప్రజల సమస్యలకు ఎక్కడికక్కడే పరిష్కారం చూపేదిశగా కార్యాచరణ రూపొందించారు.
ఇక నుంచి మండల స్థాయిలోనే ప్రజావాణిని సమర్ధవంతంగా నిర్వహించడం వల్ల ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చే బాధలు తప్పుతాయని భావించారు. వారం రోజులుగా దీనిపైనే పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన అనంతరం సోమవారం నుంచి శ్రీకారం చుట్టారు. తొలి సోమవారమే జిల్లాలోని 33 మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించగా.. ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి.
మెజార్టీ భాగం భూ సంబంధిత సమస్యలు రాగా.. పెన్షన్లు, వ్యక్తిగత సమస్యలపైనా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. ప్రజావాణిలో మొత్తం 1,706 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అధికార యంత్రాంగం మొత్తం ఎక్కడికక్కడే ప్రజావాణిలో పాల్గొనేలా ఆదేశాలిస్తూ.. కలెక్టర్ కూడా చింతపల్లి, నాంపల్లి మండలాల ప్రజావాణిలో స్వయంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తును పరిశీలిస్తూ పరిస్థితిని సమీక్షించారు. రానున్న కాలంలో మరింత పటిష్టవంగా ప్రజావాణిని అమలు చేయనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు.
తొలి సోమవారం ప్రజావాణి పూర్తయిన అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై అన్ని సోమవారాలు మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రత్యేకించి సమస్యల పరిషారంపైనే మండల స్థాయి బృందాలు దృష్టి సారించాలని అన్నారు. ఏ ఒక దరఖాస్తు జిల్లా స్థాయికి నేరుగా రావద్దని, మండలానికి వస్తే సమస్య పరిషారం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో కల్పించడమే ప్రజావాణి లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో మండల స్థాయి బృందాల పనితీరే కీలకమన్నారు.
సోమవారం ఉదయం ప్రజావాణి తర్వాత సాయంత్రం గ్రామపంచాయతీ కార్యదర్శులతో కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలన్నారు. ప్రతి సోమవారం వచ్చిన ఫిర్యాదులన్నింటికీ వారంలోపు అంటే శనివారంలోగా పరిషారం చూపాలని ఆదేశించారు. ఆన్లైన్లో సైతం వాటి పరిషారం నమోదు చేయాలన్నారు. ప్రజావాణికి వచ్చే అన్ని రకాల దరఖాస్తులను తీసుకోవాలని, గ్రామపంచాయతీల వారీగా ఆయా పథకాల కింద అర్హత ఉండే దరఖాస్తులను తీసుకొని ఒక రిజిస్టర్ నిర్వహించి, ఫైల్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. దీని ప్రకారమే పభుత్వ పథకాలు లబ్ధిదారులకు వస్తుందన్న విషయాన్ని తెలియాలని ఆదేశించారు. మండల స్థాయిలో గ్రామాల వారీగా ప్రజావాణి దరఖాస్తుల రికార్డు నిర్వహించాలన్నారు.
ప్రజావాణి కార్యక్రమంపై గ్రామపంచాయతీ కార్యదర్శులతోపాటు అందరికీ అవగాహన కలిగేలా అన్ని శాఖలకు తెలుగులో సర్యులర్లను జారీ చేస్తామని తెలిపారు. వారంలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సర్యులర్‌లో గ్రామ స్థాయిలో సిబ్బంది నిర్వహించే విధులు, బాధ్యతలపై స్పష్టంగా తెలియజేస్తామని, అలాగే జీఓలు, ఇతర సర్యులర్లతోపాటు మీ సేవలో దరఖాస్తు చేసే వివిధ రకాల అంశాలను సైతం తెలుగులో గ్రామస్థాయి వరకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ముఖ్యంగా గ్రామస్థాయి సిబ్బందిని అన్ని విషయాల పట్ల అవగాహనతోపాటు అన్ని పనులు నిర్వహించేందుకు సమాయత్తం చేయాలని సూచించారు. ప్రత్యేకించి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడీ, ఆశ, హెడ్మాస్టర్, ఉపాధి హామీ, ఐకేపీ గ్రామైక్య సంఘాలు, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య, వ్యవసాయం వంటి ముఖ్యమైన ఏడు శాఖల సిబ్బంది ఒక బృందంలా ఏర్పడి సమస్యల పరిషారానికి కృషి చేయాలన్నారు. వీరితోపాటు గ్రామ స్థాయిలో పనిచేసే ఇతర సిబ్బందిని చైత న్యం చేసేందుకు మండల స్థాయి బృందాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాబోయే రోజుల్లో గ్రామపంచాయతీల ద్వారా ధరణి సమస్యలకు పరిషారం చూపేలా కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతామని కలెక్టర్ చెప్పారు. భూముల సమస్యలకు సంబంధించిన అన్ని అంశాలపై తెలుగులో సర్యులర్ పంపిస్తామని, ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ధరణిలో 34 మాడ్యూల్స్ ద్వారా రికార్డులను సరి చేసే అవకాశం వచ్చిందని, వాటి గురించి పంచాయతీ కార్యదర్శులు తెలుసుకోవాలని చెప్పారు.
సమస్యల ఆధారంగా మాడ్యూల్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే విధంగా తెలిసి ఉండాలని అన్నారు. వారం రోజుల్లో విద్యుత్ లూజ్ వైర్లను, లో ఓల్టేజీ, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు పరిషరించాలని ట్రాన్స్‌కో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు చేపట్టిన వారికి అడ్వాన్స్ ఇచ్చామని, పది రోజుల్లో ఆ పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. గత వారం వచ్చిన ఫిర్యాదులను వచ్చే వారం ప్రజావాణిలో ముందుగా చర్చించి ఆ అనుభవం ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలపై మండల స్థాయి బృందం స్పందించి సమస్యలను పరిషరించాలని తెలిపారు. ప్రజావాణికి సంబంధించి అన్ని మండలాల్లో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజావాణి నిర్వహించే చోట హెల్ప్ డెస్లను ఏర్పాటు చేయాలని, దరఖాస్తులను రాసిచ్చేందుకు ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేయాలని ఆదే శాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర, జడ్పీ సీఈఓ, జిల్లా స్థాయి ప్రజావాణి ప్రత్యేక అధికారి ప్రేమ్‌కరణ్‌రెడ్డి, నోడల్ అధికారి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్, డీఈఓ పాల్గొన్నారు.