నల్లగొండ, అక్టోబర్ 6 : బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి ఇవ్వాల్సిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిలిపివేయడంతో సోమవారం విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించలేదు. దీంతో గంట ల తరబడి నిరీక్షించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఘెరావ్ చేశారు.
ఆ సమయంలో కలెక్టర్ బయటకు వెళ్తుండగా అడ్డుకోవటంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవటంతో కలెక్టర్ ఆయా పాఠశాలల యాజమాన్యం తో మాట్లాడి విద్యార్థులను పాఠశాలలకు పంపిస్తామని హామీ ఇవ్వటంతో వారు వెనుదిరిగారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు వినతి పత్రం అందచేశారు.
రెండేండ్లుగా నిధులు పెండింగ్..
జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 15 ప్రైవేటు పాఠశాలలు ఎంపిక చేయగా వాటిల్లో సుమారు 1400 మంది విద్యార్థులు ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారు. నాటి బీఆర్ఎస్ సర్కార్ ప్రతి ఏటా ఈ నిధులు విడుదల చేస్తుండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధులు ఇవ్వకపోవడంతో జిల్లాలో రూ.10 కోట్ల బకాయిలు పెరిగిపోయాయి.
దీంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అనుమతించకపోవటంతో తల్లిదండ్రులు కలెక్టర్‌ను ఘెరావ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, పేరెంట్స్ కమిటీ నాయకులు కార్తిక్, మామిడి జగన్, స్వామి, గాదె నర్సింహ, శోభన్, పెరుమాళ్ల సాహితి, అరుణ, రాజేశ్వరి, లక్ష్మి, శ్యామ్, నరేశ్, నామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.