రామగిరి, జూన్ 18: పర్యావరణ పరిరక్షణ, మానవ మనుగడకు చెట్లే ఆధారమని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువా రం జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కలెక్టర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, మేయర్ బుర్రి చైతన్యతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ఈ ఏడాది జిల్లాలో 57 లక్షల 70 వేల మొకలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం తమ ఇంటి ఆవరణలో విధిగా 6 మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ఈ ఏడాది 1.65 లక్షల మొకలు నాటేలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని లతీఫ్ సాబ్ గుట్టపై ప్రత్యేక శ్రద్ధతో, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మొక్కలు నాటేలా జిల్లా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.గతేడాది 90శాతం లక్ష్యం పూర్తి చేశామని ఈ ఏడాది 100 శాతం పూర్తి చేయాలన్నారు. మేయర్ చైతన్య మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5000 కోట్ల మొకల ఆవశ్యకత ఉందన్నారు. విచ్చలవిడి నిర్మాణాల కారణంగా పచ్చదనం క్షీణిస్తోందని, దీనివల్ల నీరు, ఆహారం కలుషితం అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, డీఎఫ్‌వో రాజశేఖర్, డీఐఈవో దస్రూ నాయక్, కమిషనర్ శరత్ చంద్ర, అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.