నల్లగొండ, జూలై 6 : మహారాష్ట్రకు చెందిన పార్థీ దొంగల ముఠా చాలా ప్రమాదకరమైందని, కరడుగట్టిన నేర స్వభావం గల ఈ ముఠా సభ్యులు రాష్ట్రంలో కొంతకాలంగా నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండ సీసీఎస్ పోలీసులు పక్కా స్కెచ్ వేసి నలుగురు నేరగాళ్లను వెంటాడగా.. ఇద్దరిని పట్టుకున్నట్లు తెలిపారు. నల్లగొండలోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. పార్థీ గ్యాంగ్ కొంతకాలంగా నల్లగొండ జిల్లాలోని చిట్యాల, నారట్పల్లి, కట్టంగూర్ మండలాలతోపాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్, సంగారెడ్డి జిల్లాలో ఎన్‌హెచ్-65పై వాహనాలు ఆపి నిద్రపోతున్న వారిని రాళ్లతో కొట్టి వారి వద్ద నుంచి బంగారం, డబ్బులు దొంగలించడంతోపాటు పలు నేరాలు చేసింది.
ఈ ఏడాది మే 18న ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కొల్లూరు రాజవర్ధన్ కట్టంగూర్ మండల పరిధిలో మినీ గూడ్స్ వాహనంలో పడుకోగా ఆయన కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి, స్రూడ్రైవర్తో పొడిచి చంపి రూ.14, 500 దొంగలించారు. దారిలో పామనుగుండ్ల గ్రామంలో షైన్ బైక్‌ను దొంగలించి ఆ తర్వాత ఇంటి ఆవరణ ఆరుబయట పడుకున్న పలువురి మెడలో బంగారు ఆభరణాలు అపహరించారు. వీరి మీద రాష్ట్రంలో మొత్తం 32 కేసులు ఉండగా.. నల్లగొండలో 6 రాచకొండ కమిషనరేట్‌లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్‌లో రెండు కేసులు నమోదయ్యా యి. అందులో ఒక హత్య, ఆరు దొంగతనా లు, ఏడు చైన్ స్నాచింగ్స్, ఎనిమిది బైక్ చోరీ లు, పది ఇండ్లల్లో దొంగతనాల కేసులు ఉన్నాయి.
నల్లగొండ జిల్లాలో నేరాలను పెంచుతున్న పార్థీ గ్యాంగ్‌ను పట్టుకోవడం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టారు. అప్ప పాండురంగ (ఏ-1), శుభం అశోక్ (ఏ-2), కాశ్మీర్ శశిపాల్ భోంస్లే (ఏ-3), అధేష్ అనిల్ ఖలే (ఏ-4)ను నేరస్తులుగా గుర్తించారు. వారిలో పాండురంగ, శుభం అశోక్ శుక్రవారం పట్టుబడగా.. శశిపాల్ భోంస్లే, అధేష్ అనిల్ ఖలే పరారయ్యారు. నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి పర్యవేక్షణలో నారట్పల్లి సరిల్ సీఐ కె.నాగరాజు ఆధ్వర్యంలో పార్థీ గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులను రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓఆర్ఆర్ వద్ద అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17వేల నగదు, స్క్రూ డ్రైవర్, రెండు కత్తెరలు, రెండు వెండి కాళ్ల పట్టీలు, ఒక చేతి రుమాలు, టార్చ్ లైట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పార్థీ గ్యాంగ్ విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాలు ఆపడం.. పడుకున్న వారిని రాళ్లతో కొట్టి భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుంచి బంగారం, డబ్బులు దొంగలించడం.. హైవే వెంట ఉన్న గ్రామాల్లో పడుకున్న వారి మెడలో బంగారు ఆభరణాలు దొంగలించడం వంటివి చేస్తున్నది. జూలై 5న ఈ ముఠా కదిలికలను పసిగట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు వారిని వెంబడించారు. పోలీసులను చూసిన ఇద్దరు నేరస్తులు టాటా ఏస్ వాహనం ఎకి వెళ్తుండగా వారిని వెంబడించారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ముఠా సభ్యులు పెద్దఅంబర్‌పేట్ ఓఆర్ఆర్ వద్ద ఉన్న సంపూర్ణ హోటల్ ఎదురుగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వాహనం ఆపి దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని చేజ్ చేసే క్రమంలో ముఠా సభ్యులు స్రూ డ్రైవర్, కత్తెర్లతో దాడి చేసేందుకు యత్నించారు. పోలీసులు వారిని లొంగిపోవాలని చెప్పినా వినకపోవడంతో పిస్టల్‌తో రెండు సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. చాకచక్యంగా ఆ ఇద్దరిని పట్టుకొని చిట్యాలలో సీఐకి అప్పగించారు. ఈ దాడిలో కానిస్టేబుల్ విక్రమ్ శంకర్ కుడి మణికట్టు పైభాగంలో గాయం అయ్యింది. ఉంగరపు వేలు విరిగింది. ఈ కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ సైదాబాబు, సిబ్బంది విష్ణువర్ధన గిరి, మోహసీన్ పాషా, విక్రమ్ శంకర్, సాయిరామ్, కలీమ్, సాయికుమార్‌ను ఎస్పీ అభినందించారు.