
నెల క్రితం కొండెక్కిన చికెన్ ధరలు క్రమంగా దిగి వచ్చాయి. ఏప్రిల్ చివరి వారంలో డిమాండ్ లేక పోవడంతో ధరలు అమాంతం తగ్గాయి. సరిపడా సరఫరా ఉన్నా కొనేవారు తగ్గిపోవడంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు, కోళ్ల ఫారాల యజమానులు దిగాలు పడుతున్నారు.
గత నెలలో కేజీ చికెన్ ధర రూ.300 వరకు ఉండగా ప్రస్తుతం రూ.141కి పడిపోయింది. గతంలో డిమాండ్ ఉన్నా సరఫరా లేక పోవడంతో అమాంతంగా ధరలు పెరిగాయి. దీంతో వినియోగదారులు ముఖ్య ంగా, సామాన్య ప్రజలు చికెన్ కొనడం తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించారు. ప్రస్తుతం సరిపడా సరఫరా ఉన్నా కొనుగోలు చేసే వారు తగ్గిపోవడంతో ధరలు పూర్తిగా తగ్గాయి.
ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడం వల్లే..
రెండు నెలల క్రితం చికెన్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండగా చేపల లభ్యత పెరిగింది. ఇవి తక్కువ ధరకే లభిస్తుండడంతో ప్రజలు చాలా మంది చికెన్ కంటే చేపలే నయమని భావించారు. దీంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. దీనికి తోడు ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చి కొనుగోళ్లు చేయడం తగ్గించారు. గ్రామాల్లో వరి కోతలు, ధాన్యం అమ్మకాలు జరుగుతుండగా వారంతా అటువైపు బిజీగా ఉండి చికెన్ కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదు.
బరువు పెరిగిన కోళ్లు
కోళ్లు బరువు బాగా పెరిగాయి. ఒక్కొక్కటి రెండున్నర కేజీల వరకు ఉన్నాయి. వాటిని అమ్మకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ధర తగ్గించి అమ్ముతున్నారు. వాటికి పెట్టిన ఖర్చులు వచ్చినా చాలనే భావన కోళ్లఫాం నిర్వాహకులకు కలగడం వల్లే ధరలు తగ్గించారు.
సప్లయికి తగ్గ డిమాండ్ లేక..
చికెన్ సప్లయికి తగ్గ డిమాండ్ లేదు. దీంతో చికెన్ సెంటర్లను నిర్వహించటం కత్తి మీద సాములా తయారైందని నిర్వాహకులు చెబుతున్నారు. చికెన్ సెంటర్ల అద్దెలు పెరిగిపోయి ఇటు చికెన్ ధరలు అమాంతం పడిపోవటంతో కనీసం అద్దెలు కట్టలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. చికెన్ సెంటర్లలో పనిచేసే వర్కర్లు ఇప్పటికే గిరాకీలేక, కరోనా పెరగుతున్న తరుణంలో కొన్ని చోట్ల పనులు మానేస్తున్నారు. వారం పదిరోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే చికెన్ సెంటర్లు మూతపడటం ఖాయమని నిర్వాహకులు చెబుతున్నారు.
ఫామ్ నిర్వహణకూ కష్టమే..
కోళ్ల ఫామ్‌ల యజమానులకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. కోళ్ల ఫామ్‌లలో కోళ్లు బాగా బరువు పెరిగాయి. దానా కూడా ఎక్కువగా తింటున్నాయి. వాటిని అమ్మితే ఒక్కోదాని మీద సుమారు రూ. 20 వరకు కమీషన్ వస్తుంది. కాని డిమాండ్ లేక కోళ్లను ఫామ్‌లలోనే ఉంచాల్సి పరిస్థితి నెలకొందని వారు పేర్కొంటున్నారు. లాభం సంగతి పక్కన పెడితే వాటిని సంరక్షించటం ఇబ్బందిగా తయారైందని, ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
చికెన్ సెంటర్ నడుపడం కష్టంగా ఉంది
చికెన్‌కు ప్రస్తుతం డిమాండ్ పడిపోవటంతో కోళ్లు అమ్ముడు పోవటం లేదు. దీంతో గతంలో రెండు మూడు క్వింటాళ్లు అమ్ముడు పోయేది. నేడు రోజుకు అర క్వింటా చికెన్ కూడా అమ్ముడుపోతే ఎక్కువ అనిపిస్తుంది. రేటు కూడా తక్కువ ఉండడంతో మాకు ఏమీ మిగలడం లేదు. ఫలితంగా మడిగెల అద్దెలు కట్టలేక నిర్వహణ ఇబ్బందిగా మారుతున్నది. గత సంవత్సరం ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌తో చికెన్ సెంటర్లు మూత పడ్డాయి. ఈసారైన ఆర్థికంగా నిలదొక్కుకుందామ నుకుంటే ఈ పరిస్థితి నెలకొంది.
-రవీందర్‌రెడ్డి, చికెన్ సెంటర్ యజమాని, తిరుమలగిరి