
నల్లగొండ, జూన్ 27 : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు జీవం పోశాయి. 11.40లక్షల ఎకరాల్లో మెట్ట పంటలు సాగు కానుండగా.. ప్రధానంగా పత్తి పంట 9.75లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో 3.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వానలు తొలి దశలో పంటలు సాగు చేసిన రైతులను సంతోషపెట్టగా.. మలి దశ పంటల సాగుకు దోహదపడనున్నాయి.
పత్తి పంటకు ప్రాణం..
జూన్ ఆరంభంలోనే నైరుతి వర్షాలు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో కురవకపోవడంతో 30శాతం మంది మాత్రమే పత్తి పంట సాగు చేశారు. విత్తనాల్లో కొన్ని మొలకెత్తగా మరికొన్ని భూమిలోనే ఉన్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలతో మొలకలకు జీవం రాగా, భూమిలో ఉన్నవి మొలకెత్తనున్నాయి. నల్లగొండ జిల్లాలో తొమ్మిది లక్షల ఎకరాల్లో మెట్ట పంటలు సాగు కానుండగా అందులో పత్తి 8.11 లక్షలు ఉంది. ఇప్పటికే 3.12లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సూర్యాపేట జిల్లాలో 2.40లక్షల ఎకరాల్లో మెట్ట సాగు కానుండగా పత్తి పంట 1.64లక్షలకు గాను ఇప్పటికే 36వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇక రెండు జిల్లాల్లో కంది, పెసర, జీలుగ, వేరుశనగ లాంటి పంటలు మరో 18వేల ఎకరాల్లో సాగు చేశారు.
రెండోరోజూ వర్షం
నైరుతి రుతుపవనాల ఆగమనం రెండో దశ ప్రారంభమై నల్లగొండ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. శనివారం నుంచే వాతావరణం చల్లబడి రాత్రి అక్కడక్కడ వర్షం పడింది. ఆదివారం ఉదయమే మళ్లీ షురూ కాగా రాత్రి వరకు అంతటా కురిసింది. జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం భారీ వర్షం పడింది. నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గంతోపాటు నకిరేకల్, మునుగోడు, హాలియా, మిర్యాలగూడ ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం పడింది.