
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం రెండు ప్రమాదాలు జరిగాయి. అతివేగంతో ఓవర్ టేక్ చేయబోయి కారు పల్టీకొట్టగా ముగ్గురు దుర్మరణం చెందారు. అక్కడ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తుండగా మరో 20 నిమిషాల వ్యవధిలో ఆగి ఉన్న లారీని మరో కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. వీరంతా కృష్ణా, ప్రకాశం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు. ఇక నాగర్‌కర్నూల్ జిల్లాలోని
మద్దిమడుగు వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మిర్యాలగూడెం మండలం జటావత్ తండాకు చెందిన ముగ్గురు చనిపోయారు. పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కట్టంగూర్, సెప్టెంబర్ 19 : 65వ నంబర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులో ఆదివారం ఉదయం అతి వేగంగా వెళ్తున్న రెండు కార్లు అదుపుతప్పి ముందున్న లారీలను ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. శాలిగౌరారం సీఐ పసుపులేటి నాగదుర్గాప్రసాద్, కట్టంగూర్ ఎస్ఐ బత్తుల శివప్రసాద్ తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఐపరాజుపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కదిరి గోపాల్‌రెడ్డి(31), భార్య రచన(30) కుతూరు రియాన్స్(5), స్నేహితుడు కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ప్రశాంత్(24)తో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఒంగోలుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ముత్యాలమ్మగూడెం శివారులో గచ్చుగూరు వద్ద వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ముందు వెళ్తున్న ట్రాన్స్పోర్ట్ లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గోపాల్‌రెడ్డి, ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన రచనను నార్కట్‌పల్లి వద్ద ఉన్న కామినేని దవఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. రియాన్స్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నది.
మిన్నంటిన రోదనాలు..
ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. తల్లిదండ్రులను కోల్పోయి దవాఖానలో చిక్సిత పొందుతున్న చిన్నారి రియాన్స్ గురించి తెలుకొని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. శివప్రసాద్, వినయ్‌కుమార్ మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం : సీఐ
జాతీయ రహదారిపై వాహనాలు నడిసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సరైన అవగాహన లేకపోవడం, అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని సీఐ నాగదుర్గాప్రసాద్ తెలిపారు. ప్రశాంత్, శివప్రసాద్ కారును వేగంగా నడిపి ఆ తర్వాత అదుపుచేయలేక లారీలను ఢీకొట్టారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డెయింజర్ జోన్‌గా ప్రకటించి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశామని, వాహనదారులు వాటిని ఖాతరు చేయక పోవడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు
ట్రాఫిక్ జామ్‌తో మరో ప్రమాదం..
ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతినగా అందులో ఇరుక్కుపోయిన రచన, చిన్నారి రియాన్స్ను క్రేన్ సాయంతో బయటకు తీస్తున్న సమయంలో జాతీయ రహదారిపై 200 మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో పురోహితులైన రంగారెడ్డి జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామానికి చెందిన జంగం శివప్రసాద్(23), హైదరాబాద్‌లోని బండంపేటకు చెందిన వినయ్‌కుమార్ (21) సూర్యాపేటలోని సత్యసాయి మందిరంలో అభిషేకం చేసేందుకు కారులో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అప్పటికే టాఫ్రిక్ జామ్‌లో రోడ్డుపై వాహనాలు నిలిచిపోగా వేగంగా వచ్చిన వీరి కారు సిమెంట్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి గురైన కార్లతో పాటు లారీలను క్రేన్ సాయంతో పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నాగదుర్గాప్రసాద్, ఎస్ఐ బత్తుల శివప్రసాద్ తెలిపారు.