
14ఏండ్లు నిండిన వారికి
పదో తరగతిలో ప్రవేశం
రాయడం, చదువడం వస్తే చాలు
ఉమ్మడి జిల్లాలో 70అధ్యయన కేంద్రాలు
ఉచిత పాఠ్యపుస్తకాలు,
ఆన్లైన్, డిజిటల్ పాఠాలు
2021- 22 పది, ఇంటర్మీడియట్లో
అడ్మిషన్లకు ఆహ్వానం
వివిధ కారణాలతో మధ్యలోనే చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ ఆహ్వానం పలుకుతున్నది. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ అర్హత లేకుండా ఇప్పటికే కొలువుల్లో స్థిరపడిన వారికి కూడా ఇదొక మంచి అవకాశం. ప్రస్తుతం 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు సెప్టెంబర్ 10 వరకు అవకాశం ఉన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించి 70అధ్యయన కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి.
పదో తరగతి, ఆపై తరగతులు చదువలేకపోయిన వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ మరో అవకాశాన్ని కల్పిస్తున్నది. గృహిణులు, ఉద్యోగులు తమకు అవకాశం ఉన్న సమయంలో, సెలవు రోజుల్లో తరగతులకు హాజరై కోర్సు పూర్తి చేసుకునే వీలున్నది. అడ్మిషన్ తీసుకున్న వారికి పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తారు. 14ఏండ్లు నిండి రాయడం, చదువడం వస్తే చాలు. స్వీయ నిర్ధారణ పత్రాన్ని సమర్పించి పదో తరగతిలో అడ్మిషన్ తీసుకోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్లో చేరవచ్చు. పదో తరగతి పూర్తి చేసి రెండు సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నది. ప్ర స్తుత కొవిడ్ నేపథ్యంలో రెగ్యులర్ విద్యకు దీటుగా ఆన్లైన్, డిజిటల్ పాఠాలు సైతం అందుబాటులో ఉన్నాయి.
ఓపెన్ స్కూల్స్ లక్ష్యం
విద్యకు దూరమైన వారికి తిరిగి చదువుకునే అవకాశం కల్పించడం.
వినూత్న సాంకేతికత, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్(ఓడీఎల్) పద్ధతులను ఉపయోగించి అభ్యాసకులకు(విద్యార్థులకు) నైపుణ్య శిక్షణ అందిస్తుంది.
సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, జీవన నైపుణ్యాలను పెంచి జీవితంలో స్థిరపడే మార్గాలను చూపుతుంది.
ఉమ్మడి జిల్లాలో 70 స్టడీ సెంటర్స్..
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్కు 70స్టడీ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో పదో తరగతికి నల్లగొండ జిల్లాలో 38, సూర్యాపేట జిల్లాలో 19, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 ఉన్నాయి. అదే విధంగా ఇంటర్మీడియెట్ కోసం నల్లగొండ జిల్లాలో 33, సూర్యాపేట జిల్లాలో 20, యాదాద్రి భువనగిరిలో 7స్టడీ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
అందరికీ విద్యనందించాలనేది ఓపెన్ స్కూల్ సొసైటీ లక్ష్యం. మధ్యలో చదువు మానేసిన వారు, నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ఇది చక్కటి అవకాశం. అర్హులంతా అడ్మిషన్లు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫైన్ లేకుండా సెప్టెంబర్ 10వరకు, ఫైన్ చెల్లించి సెప్టెంబర్ 23వరకు అడ్మిషన్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలకు డీఈఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
ఫీజులు ఇలా..
పదో తరగతిలో చేరే వారికి ఓసీలకు రూ.1,200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.800
ఇంటర్మీడియట్ లో చేరే వారికి ఓసీలకు రూ.1,400, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.1,000.
ఫీజు చెల్లిస్తే అడ్మిషన్లతో పాటు పాఠ్య పుస్తకాలను సైతం ఉచితంగా అందిస్తారు.