e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home నల్గొండ నకిలీ ముఠా కటకటాల్లోకి..

నకిలీ ముఠా కటకటాల్లోకి..

నకిలీ ముఠా కటకటాల్లోకి..
  • అంతర్రాష్ట్ర స్థాయిలో నకిలీ విత్తనాల దందా
  • రూ.6కోట్ల ‘నైరుతి’ సీడ్స్‌ సీజ్‌
  • 13 మంది అరెస్టు, పరారీలో ముగ్గురు
  • పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లొచ్చినా మారని తీరు
  • 40 ఎకరాల్లో రైతులు పంట నష్టపోకుండా కాపాడిన నల్లగొండ జిల్లా పోలీసులు

నీలగిరి, జూన్‌ 18 : నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ రెంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఐజీ ఏవీ రంగనాథ్‌, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. జిల్లా పోలీసులకు లభించిన కచ్చిత దేవరకొండ ప్రాంతానికి చెందిన రైతుల సమాచారం మేరకు నల్లగొండ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు 15 రోజుల పాటు దర్యాప్తు చేసి నకిలీ దందాకు అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. ఈ కేసుల్లో 13 మంది నిందితుల్లో నంద్యాలకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డి గతంలో తెలుగు రాష్ర్టాల్లోని వివిధ జిల్లాల్లో అరెస్టు అయి గత సంవత్సరం నకిలీ పత్తి విత్తనాల కేసులో పీడీ యాక్టు కింద వరంగల్‌ జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. జైలు నుంచి విడుదల అయ్యాక ఖమ్మం జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి, నల్లగొండకు చెందిన బాలస్వామి, దేవరకొండకు చెందిన పిచ్చయ్య, హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, పవన్‌తోపాటు మరికొంత మందితో కలిసి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల దందాకు స్కెచ్‌ వేశాడని తెలిపారు. పోలీసుల విచారణలో భాగంగా గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలోని గుండ్ల పోచంపల్లి, యల్లంపేట, దేవర యాంజాల్‌, బోయినపల్లి, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, 140 టన్నుల వరి, 40 టన్నుల మొక్కజొన్న, నాలుగు క్వింటాళ్ల కూరగాయల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పత్తి విత్తనాలను నల్లగొండకు తరలించగా.. వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను సీజ్‌ చేసి జామ్‌ జామ్‌ ఎంజీ అగ్రిటెక్‌ గోడౌన్లలో సీల్‌ వేసి ఉంచామన్నారు. మరో నిందితుడు మధుసూదన్‌రెడ్డి 2016లో నకిలీ విత్తనాల కేసులో శంషాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ, నల్లగొండ జిల్లా మునుగోడు, చండూర్‌, నకిరేకల్‌, గుర్రంపోడ్‌లో అరెస్టయి పీడీ యాక్టు కింద జైలుకు వెళ్లి మళ్లీ ఇదే వ్యాపారాన్ని చేస్తున్నాడని తెలిపారు. ప్రాంతానికి చెందిన గోశ స్వామిదాస్‌, దుబ్బ వెంకట్‌రెడ్డి, హుస్సేన్‌వలీ అలియాస్‌ బాషా, బండారు సుధాకర్‌ వద్ద కిలో రూ.200కు కొనుగోలు చేసి రైతులకు అర కిలో రూ.450కు విక్రయించేవాడని, వీటిని తన అనుచరులు చెన్నకేశవరెడ్డి, మధు సహకారంతో రవాణా చేస్తున్నాడని నంద్యాలకు చెందిన మరో నిందితుడు, పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన గోరుకంటి పవన్‌కుమార్‌ ప్రధాన నిందితులతో విత్తనాల కమీషన్‌ వ్యాపారం చేస్తూ దందా సాగించేవాడని తెలిపారు.
నాణ్యతా ప్రమాణాలు లేకున్నా..
మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు చార్టెడ్‌ ఎకౌంటెంట్‌ ఎనుబోతుల శ్రీనివాస్‌రెడ్డి మేడ్చల్‌ జిల్లా గుండ్ల పోచంపల్లిలో నైరుతి సీడ్స్‌ పేరుతో కంపెనీ స్థాపించి అదే పేరుతో నకిలీ విత్తనాల దందా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి నాలుగు సంవత్సరాలుగా రైతుల నుంచి వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను తక్కువ ధరకు సేకరించి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, జీఓటీ పరీక్షలు నిర్వహించకుండా, లైసెన్స్‌ లేకుండా సీడ్‌ ప్యాకింగ్‌ కవర్లు, వాటిపై క్యూఆర్‌ కోడ్‌, ఇతర లేబుల్స్‌ ముద్రించి ప్రాసెసింగ్‌ యూనిట్లతో ప్యాకింగ్‌ చేసి విక్రయించేవాడని అన్నారు. గడువు ముగిసిన ప్యాకెట్లపై టిన్నర్‌తో తేదీలను చెరిపేసి కొత్త తేదీలను ముద్రించేవాడని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి భాగస్వామి అయిన కాకినాడకు చెందిన మెడిశెట్టి గోవింద్‌ దేవర యాంజాల్‌లోని ఎంజీ అగ్రిటెక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో విచారించగా నంద్యాలకు చెందిన గోరుకంటి పవన్‌కుమార్‌ను పరిచయం చేసి అతని ద్వారా పాత నేరస్తులైన మధుసూదన్‌రెడ్డి, స్వామిదాస్‌ నుంచి రిజెక్టెడ్‌ సీడ్స్‌, గడువు తీరిన విత్తనాలు, జిన్నింగ్‌ మిల్లుల నుంచి వచ్చిన పత్తి గింజలు సేకరించేవారన్నారు. వాటిని ప్రాసెసింగ్‌ చేసి ట్రూత్‌ ఫుల్‌ లేబుల్స్‌ ముద్రించి, నాణ్యమైన విత్తనాలుగా నమ్మించేందుకు వినియోగించి, అందమైన కవర్లలో ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లోకి తరలించే ప్రయత్నం చేశారన్నారు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్నట్లు వివరించారు. పత్తి విత్తనాల లైసెన్స్‌, విక్రయాలకు అనుమతి లేకుండానే శ్రీనివాస్‌రెడ్డి తాను విక్రయించే నకిలీ విత్తనాలను నాణ్యమైనవిగా నమ్మించేందుకు నాగపూర్‌కు చెందిన ఐసీఏఆర్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లుగా అవనరం లేకున్నా ప్యాకింగ్‌ కవర్లపై ముద్రిస్తున్నాడని వివరించారు.
వర్షాధారిత ప్రాంతాలే టార్గెట్‌
నకిలీ విత్తనాలతో పంటలు సాగు చేయడం వల్ల దిగుబడి రాకపోతే రైతులు తిరిగి కంపెనీలను ప్రశ్నించకుండా ఉండేందుకు ముందస్తుగానే వర్షాధారిత ప్రాంతాలను ఎంచుకునేవారు. నకిలీ విత్తనాల అమ్మకాలకు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాలను టార్గెట్‌ చేసుకున్నారు. డీలర్లతో కుమ్మక్కై ముఠా అనుచరులతో మార్కెటింగ్‌, విక్రయాలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. పలు కంపెనీలకు చెందిన విత్తనాలను మిక్స్‌ చేసి మోసాలకు పాల్పడేవారని తెలిపారు. నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వెళ్లి ఉంటే సుమారు 40వేల ఎకరాల్లో వేసి రైతాంగం నష్టపోయేది. సీజ్‌ చేసిన విత్తనాలలో 20వేల ఎకరాలు పత్తి, 10వేల ఎకరాలు వరి, మరో 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేసేవారు.
వెస్ట్‌ జోన్‌ పరిధిలో 141 కేసులు
నకిలీ పత్తి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల విత్తనాలకు సంబంధించి వెస్ట్‌ జోన్‌ పరిధిలోని 13 జిల్లాల్లో 141 కేసులు నమోదు చేసి రూ.21,12,96,000 విలువైన విత్తనాలు సీజ్‌ చేసినట్లు ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర వివరించారు. నల్లగొండ జిల్లాలో సీజ్‌ చేసిన రూ.ఆరు కోట్ల విలువైన నకిలీ విత్తనాలతో కలిపి మొత్తం 27.12 కోట్ల రూపాయల విత్తనాలు సీజ్‌ చేశామన్నారు.
అరెస్టయిన నిందితులు..
నకిలీ దందాలో 13 మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎనబోతుల శ్రీనివాస్‌రెడ్డి, కర్నాటి మధుసూదన్‌రెడ్డి, గోరుకంటి పవన్‌కుమార్‌, గోశ స్వామిదాస్‌, దుబ్బ వెంకటశివారెడ్డి, అంగడి హుస్సేన్‌, గాదె పెద్దిరెడ్డి, మేడిశెట్టి గోవిందు, సెలం గోపి, పుట్ట అఖిల్‌, కోలా పిచ్చయ్య, పొలిశెట్టి బాలస్వామి, బండారు సుధాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎనబోతుల రజిత, చెన్నకేశవరెడ్డి, మధు పరారీలో ఉన్నారు.
సమర్థవంతంగా పనిచేసిన టాస్క్‌ఫోర్స్‌, పోలీసు సిబ్బందిని ఐజీలు అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ నర్మద. డీటీసీ ఎస్పీ సతీశ్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐలు నర్సింహాచారి, స్పర్జన్‌రాజ్‌, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నకిలీ ముఠా కటకటాల్లోకి..
నకిలీ ముఠా కటకటాల్లోకి..
నకిలీ ముఠా కటకటాల్లోకి..

ట్రెండింగ్‌

Advertisement