
అడవిదేవులపల్లి, ఏప్రిల్ 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏడో విడుత మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అడవిదేవులపల్లి మండలంలోని 13నర్సరీల్లో 1.50 లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అందులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, బాల్నేపల్లి, చిట్యాల, మొల్కచర్ల, నడిగడ్డ, నల్లమిట్టతండా, బంగాకుంటతండా, ఉల్సాయిపాలెం, కొత్తనందికొండ, గోన్యతండా, చాంప్లాతండా, జిలకరకుంటతండా గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు.
అన్నిరకాల మొక్కలు సిద్ధం
మండలంలోని 13నర్సరీల్లో కానుగు, వేప, టేకు, వెదురు, నిమ్మ, దానిమ్మ, మునగ, బొప్పాయి, సుబాబుల్, చింత, మల్లె, మందారం, గన్నేరు, పచ్చగన్నేరు వంటి 1.5 లక్షల మొక్కలు సిద్ధం చేస్తున్నారు. జూలై 1 నుంచి సెప్టెంబరు లోగా మండల వ్యాప్తంగా నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ప్రతి నర్సరీలో 10వేల మొక్కలు
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని మొత్తం 46 గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రతి నర్సరీలో 10వేల మొక్కలు పెంచేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. జూలై నాటికి నాటేందుకు వీలుగా మొక్కలు ఏపుగా పెరిగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రణాళికలు సిద్ధం చేశాం..
జూలై 1 నుంచి ఏడో విడుత హరితహారం కింద మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతి ఇంటికీ కనీసం ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలి. ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలి.
బాధ్యతగా భావించాలి
మొక్కలను పెంచడం అందరి బాధ్యత. మొక్కల కొరత ఈసారి ఉండకుండా చూస్తాం. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశాం. పనులు చురుగ్గా సాగుతున్నాయి. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, టేకు మొక్కలు అందుబాటులో ఉన్నాయి.