
కేతేపల్లి, ఆగస్టు 13 : మూసీ ప్రాజెక్టు పరిధిలో వరుసగా మూడో ఏడాది వానకాలం పంటలకు ప్రభుత్వం నీటిని అందిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఆయకట్టు పరిధిలో రైతులు పూర్తిగా వరిసాగు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. గత నెలలో వరుసగా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కాల్వల పనులను నిలిపి వేయించి ఆయకట్టుకు నీటిని విడుదల చేయించారు.
అధికారులు నీటిని విడుదల చేయడంతో కుడి, ఎడమ కాల్వల కింద రైతులు సంతోషంగా వరినార్లు పోసుకున్నారు.ప్రస్తుతం వరినార్లు ఏతదశకు చేరుకున్నాయి. ఆయకట్టు రైతులు దుక్కులు దున్నుతూ పొలం పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. బోర్లు, బావుల కింద ముందుగా నార్లు పోసిన రైతులు నాట్లు పూర్తి చేశారు. ఆయకట్టు పరిధిలో మొత్తం 24 వేల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరోక్షంగా మరో 4 వేల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది. కాగా ఒకేసారి నార్లు పోయడంతో కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆయకట్టు పరిధిలో నాట్లు ఆలస్యం అవుతున్నాయి.
గత పాలకుల హయాంలో ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకొని గేట్లు తుప్పు పట్టిపోయాయి. వానకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసినప్పటికీ లీకేజీల ద్వారా దిగువకు నీరు వృథాగా వెళ్లేది. దీంతో యాసంగిలో రైతులకు నీటిని అందివ్వడం అధికారులకు ఇబ్బందిగా మారేది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రూ.19 కోట్లతో నూతన గేట్లు, బీటీ రోడ్డును ఏర్పాటు చేశారు. రూ.67 కోట్లతో కాల్వ ఆధునీకరణ పనులు సైతం చేపట్టారు. నూతన గేట్ల ఏర్పాటుతో లీకేజీలు లేకపోవడంతో ప్రాజెక్టు త్వరగా నిండుతున్నది. దీంతో వానకాలం పంటలకు కూడా రైతులకు నీళ్లందించే వెసులుబాటు కలిగింది.ప్రభుత్వం ప్రాజెక్టు అభివృద్ధికి చేపడుతున్న పనులతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
మూసీ ప్రాజెక్టు నుంచి గతంలో వానకాలం పంటలకు నీళ్లు వచ్చేవి కావు. ప్రాజెక్టుకు నూతన గేట్లు ఏర్పాటు చేసిన తర్వాత లీకేజీలు లేక త్వరగా నిండుతుంది. ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కేటాయి ంచిన సీఎం కేసీఆర్‌కు మేం రుణపడి ఉంటాం.
-ఆల్దాసు కృష్ణయ్య రైతు, కొత్తపేట
ఆయకట్టు పరిధిలో వరినాట్లు పూర్తికాకపోవడంతో ఈ నెల 20 వరకు నీటి విడుదలను పొడిగించాం. కాల్వ ఆధునీకరణ పూర్తయిన ప్రదేశాల్లో డిస్ట్రిబ్యూటరీలకు నూతన షట్టర్లను ఏర్పాటు చేశాం. చివరి ఆయకట్టు రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీటిని అందిస్తున్నాం.
-డి.ఉదయ్‌కుమార్, ప్రాజెక్టు ఏఈ