
రైస్‌మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు 189 దరఖాస్తు
421.35 ఎకరాల భూసేకరణకు అధికారుల నోటీసు
మిర్యాలగూడ రూరల్, సెప్టెంబర్ 7 : చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నది. మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామపంచాయతీ పరిధిలో దీనిని ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాంతం సాగర్ ఎడమ కాల్వ అయకట్టు కింద ఉండడం వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే రైతులకు మేలు కలుగనున్నది.
189 దరఖాస్తులు
ఆలగడప వద్ద నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఇప్పటికే 189 మంది పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు, రైస్ మిల్లులతో పాటు, రవ్వ, గన్నీబ్యాగుల తయారీ, పిండి, పప్పు, నూనె పరిశ్రమలు వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.
భూ సేకరణకు నోటీసు జారీ
పారిశ్రామిక పార్కు కోసం 421.35 ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు గాను మిర్యాలగూడ మండలం ఆలగడప, రాయినిపాలెం, జాలుబాయితండా, అవంతీపురం, చిన్న క్యాంపు, సుబ్బారెడ్డి గూడెం గ్రామాల పరిధిలో ఉన్న ప్రాంతం అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు. ఆయా గ్రామాల్లో 421.35 ఎకరాల భూసేకరణకు ఈ నెల ఒకటో తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా గ్రామాలకు చెందిన 413 మంది రైతుల నుంచి భూమిని సేకరించనున్నారు.
కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి
ఆలగడపలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయవద్దంటూ పలువురు గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు వినతిపత్రం అందించారు. తమ భూములు పరిశ్రమలకు తీసుకుంటే తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో జడ్పీటీసీ విజయసింహారెడ్డి, సర్పంచ్ చెన్నబోయిన శ్రీనివాస్, రాజయ్య, రైతులు ఉన్నారు.
రైతులకు మేలు
పారిశ్రామిక పార్కు ఏర్పాటుతో రైసు మిల్లులకు, రైతులకు చేయూత లభించనున్నది. మిర్యాలగూడ సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతం కావడంతో రైతులు అత్యధికంగా వరిని పండిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఆధునిక రైస్‌మిల్లులు ఏర్పాటు చేయడం వల్ల రైతులు ధాన్యం విక్రయించుకునేందుకు దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే మండలంలో 90 రైస్ మిల్లులు ఉండగా.. అందులో 45 మాత్రమే ఆధునిక టెక్నాలజీతో కూడినవి ఉన్నాయి. పారిశ్రామిక పార్కు ఏర్పాటుతో మరో 150 ఆధునిక రైస్‌మిల్లులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.