
రామగిరి, జూలై 5 : హాలియాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా డిగ్రీ తరగతులు నిర్వహణ జరుగనున్నది. ఈ మేరకు ఇన్‌చార్జ్జి ప్రిన్సిపాల్‌గా సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంగి రవికుమార్‌ను నియమిస్తూ కళాశాల విద్య కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కోరిక మేరకు సాగర్ ఉప ఎన్నిక సభలో హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి కళాశాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో 300 మంది విద్యార్థుల కు అవకాశం కల్పించనున్నారు. అయితే దోస్త్ ద్వారానే అడ్మిషన్లు కల్పించనున్నారు.
విద్యార్థులకు తప్పనున్న దూరభారం
ఇప్పటివరకు సాగర్ నియోజకవర్గం నుంచి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ విద్యకోసం సుమారు 50 కిలోమీటర్ల దూరంలో(నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాలకు) వెళ్లాల్సి వస్తోంది. సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు కళాశాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు బాధ తప్పడంతో పాటు బాలికలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది.
ఇవీ కోర్సులు…
రాష్ట్ర కళాశాల విద్యాశాఖ ఉత్తర్వులమేరకు 2021-22 విద్యా సంవత్సరం బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు దోస్త్లోనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పూర్తి వివరాలకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్ 9440208972, ఐడియల్ కళాశాల(ఎన్జీ కళాశాల నల్లగొండ) పూర్తి అదనపు బాధ్యతల ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్ 9154 806813లో సంప్రదించవచ్చు.
ప్రిన్సిపాల్‌గా సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అవకాశం..
మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పరంగి రవికుమార్‌ను హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇన్చార్జీ ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సోమవారం అక్కడ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. మంగళవారం హాలియాలో విధుల్లో చేరనున్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకుడిగా రవికుమార్ సుదీర్ఘకాలం పనిచేశారు. విద్యార్థులకు ఉచితంగా వేసవిలో వివిధ పోటీ పరీక్షలు, పీజీ కెమిస్ట్రీ కోర్సులకు శిక్షణ ఇచ్చి భవిష్యత్‌కు బాటలు వేశారు. అంతే కాకుండా ఎన్జీ కళాశాలలో పరీక్షల నియంత్రణాధికారిగా, హెచ్ఓడీగా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉండడంతోనే ప్రిన్సిపాల్‌గా అవకాశం కల్పించారు.