
దేవరకొండ, మే 4 : జూన్లో నిర్వహించే ఏడో విడుత హరితహారం కార్యక్రమంలో నాటేందుకు అవసరమైన మొక్కలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెంచుతున్నారు. దేవరకొండ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు అవసరమైన నీటి, నీడ వసతిని ఏర్పాట్లు చేశారు.
నర్సరీల్లో మొక్కల పెంపకం
పట్టణ ప్రగతిలో భాగంగా దేవరకొండ పట్టణ సమీపంలోని ఉప్పువాగు వద్ద నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే 50 వేల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండగా, మరో 50 వేల పాలిథిన్ కవర్లను మట్టితో నింపి పూలు, పండ్ల మొక్కల విత్తనాలు కూడా వేశారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా నాటేందుకు వీలుగా నీడనిచ్చే మొక్కలను కూడా ప్రత్యేకంగా పెంచుతున్నారు.
వివిధ రకాల మొక్కలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల వెంట నాటేందుకు వీలుగా కానుగ, సీమతంగేడు, పగడం, గుల్మోహర్ వంటి మొక్కలను నర్సరీలో పెంచుతున్నారు. దీంతో పాటు పట్టణంలో ప్రజలు తమ ఇండ్లల్లో పెంచుకునేందుకు వీలుగా 20వేలకు పైగా వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను సైతం సిద్ధం చేస్తున్నారు. పట్టణ ప్రణాళికలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా అందుకు అవసరమైన ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు చేపట్టారు. పట్టణ నర్సరీలో ఉన్న మొక్కలతో పాటు అవసరమైన మొక్కలను బయటి నుంచి తెప్పించుకునేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
మొక్కలను సిద్ధం చేస్తున్నాం
జూన్లో వర్షాలు కురిసిన వెంటనే నాటేందుకు వీలుగా వన నర్సరీలో మొక్కలు పెంచుతున్నాం. పట్టణంలో జాతీయ రహదారి వెంట, అన్ని వార్డుల్లో లక్ష మొక్కలు నాటాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే నర్సరీలో మొక్కలు పెరుగుతుండగా మరో 20 వేల పండ్లు, పూల మొక్కలను బయటి నుంచి తెప్పించాలని నిర్ణయించాం.
-వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్, దేవరకొండ