పెన్‌పహాడ్, జూన్ 26 : పెన్‌పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామ పంచాయితీ కార్యదర్శి అనంతుల సతీశ్‌కుమార్ ఏసీబీకి చిక్కాడు. ఆయనపై అవినీతి ఆరోపణలు రాగా గురువారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చందర్ విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 6న నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన బొగ్గులబట్టి వ్యాపారి గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళ్లి బొగ్గు బట్టి పెట్టుకోవడానికి అనుమతి పత్రం (ఎన్ఓసి) అడుగగా రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. అన్ని డబ్బులు ఇవ్వలేనని రూ.8 వేలు ఇవ్వగలనని కార్యదర్శికి తెలిపాడు. అనంతరం ఏసీబీని ఆశ్రయించడంతో విచారించగా ఆధారాలను అనుసరించి అనంతుల సతీశ్కుమార్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.