మిర్యాలగూడ, ఆగస్టు 1 : నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తుండడంతో శుక్రవారం ఎడమ కాల్వకు నీటి విడుదల చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కానీ, నీటి ప్రవాహాన్ని తట్టుకుని కింది వరకూ పంపాల్సిన కాల్వలు అందుకు తగట్టు ఉన్నాయా అంటే.. లేవనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడమ కాల్వ కట్టలు పలుచోట్ల బలహీనంగా ఉండడంతో ఎక్కడ గండి ఏర్పడుతుందోనన్న భయాందోళన రైతుల్లో నెలకొంది.
వారం క్రితం నడిగూడెం మండలం రామాపురం వద్ద కాల్వ కట్టకు బుంగ పడగా, అధికారులు మర్మతులు చేయకుండా వదిలేశారు. కేవలం అటుగా ఎవరూ వెళ్లకుండా కంప చెట్లు వేసి, హెచ్చరిక ఫ్లెక్సీని మాత్రం ఏర్పాటుచేశారు. రెండు సంవత్సరాల క్రితం నిడమనూరు మండలం ముప్పారం-వేంపాడు వద్ద నారెళ్లగూడెం మేజర్ సమీపంలో పడిన గండి ఎంత విధ్వంసం సృష్టించిందో రైతులు ఇంకా మరిచిపోలేదు.
అప్పట్లో లక్ష్మీదేవిగూడెం, నిడమనూరు, నర్సింహులుగూడెం గ్రామాల్లోని వందలాది ఎకరాల్లో పంట మునగడంతోపాటు అడుగల మేర ఇసుక మేటలు వేసింది. చుట్టుపక్కల ప్రజలకు కంట మీద కునుకు లేకుండా పోయింది. దానికితోడు మరమ్మతుల కారణంగా నీరందక వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
అధికారుల నిర్లక్ష్యంతోనే పరిస్థితి ఇంత తీవ్ర రూపం దాల్చిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికీ అనేక చోట్ల ఎడమ కాల్వ కట్టలు బలహీనంగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటికే గత రెండు సీజన్లు ఆయకట్టుకు నీళ్లు రాలేదు. ఇప్పుడు వరుణుడి కరుణతో వరద పోటెత్తుండడంతో ఆశలు చిగురిస్తుండగా, కాల్వల పరిస్థితి భయపెడుతున్నది.
కాల్వ మరమ్మతులకు రూ.44.78కోట్లు…
సాగర్ ఎడమ కాల్వ పటిష్టంగా ఉండడానికి గండ్లు పడకుండా ఉండేందుకుగాను గతంలో
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.44.78 కోట్లు కేటాయించింది. పనులు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నాణ్యత కూడా పాటించడం లేదని రైతులు వాపోతున్నారు. పలుచోట్ల కాల్వ కట్ట లైనింగ్, ఫ్లోరింగ్ దెబ్బతినడంతో రూ.30కోట్లతో అధికారులు తిరిగి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
మూడ్రోజుల్లో పనులు పూర్తి
ఎడమ కాల్వ కట్ట మరమ్మతు పనులు దాదాపు దగ్గర పడ్డాయి. మూడు రోజుల్లో మొత్తం పూర్తవుతాయి. ఎక్కడా గండ్లు పడే అవకాశం లేదు. ఎడమ కాల్వకు నీటి విడుదల జరిగినా ఎలాంటి నష్టం వాటిళ్లకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– లక్ష్మణ్, ఎన్నెస్పీ ఈఈ