
నందికొండ, నవంబర్ 28 : ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతి మిగిల్చే నాగార్జునసాగర్‌లో లాంచీ ప్రయాణానికి వేళయింది. కృష్ణమ్మ సవ్వడులపై కొనసాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు.. మురిపించే జింకలు, దుప్పుల విన్యాసాలు.. నదికి ఇరువైపులా నల్లమల కొండలు, వాటిపై చారిత్రక ఆనవాళ్లు.. గిలిగింతలు పెట్టే అలలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వారాంతంలో రెండ్రోజులపాటు కొనసాగే లాంచీ ప్రయాణానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. పర్యాటకులకు సౌకర్యాలు, భద్రతను కల్పిస్తూ హిల్‌కాలనీ లాంచీస్టేషన్ నుంచి ప్రారంభమయ్యే జాలీ ట్రిప్పులను సోమవారం ప్రారంభించనుంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటిమట్టం 570 అడుగులకు పైగా ఉంటే నందికొండ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం కొనసాగించవచ్చు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యం 590 అడుగులు ఉండడంతో లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. అయితే.. ప్రతి శనివారం జాలీ ట్రిప్పు నడుపుతుండగా.. వరంగల్‌కు చెందిన 40 మంది బుకింగ్ చేసుకోవడంతో మరో 20 మంది పర్యాటకులతో కలిపి సోమవారం ప్రత్యేకంగా లాంచీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.
లాంచీ టికెట్ ధరలు ఇలా..
శ్రీశైలానికి లాంచీలను ప్రతి శనివారం పర్యాటకుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. రెండ్రోజుల పాటు సాగే ప్రయాణంలో పర్యాటకులకు భద్రతతోపాటు అన్ని వసతులను తెలంగాణ టూరిజం శాఖ వివిధ ప్యాకేజీల్లో అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు బస్సు ప్రయాణం,శ్రీశైలంలోమల్లికార్జునస్వామి దర్శనం అనంతరం మరుసటి రోజు శ్రీశైలం నుంచి నందికొండకు లాంచీలో ప్రయాణం. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు తీసుకెళ్తారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.3,999 చార్జి ఉంటుంది. నందికొండ నుంచి శ్రీశైలం లాంచీలో పోయి రావడానికి పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2వేల చార్జి వసూలు చేస్తారు. ఒక వైపు ప్రయాణం (నందికొండ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు లేదా శ్రీశైలం నుంచి నందికొండకు వచ్చేందుకు) పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 చార్జి ఉంటుందని టూరిజం శాఖ అధికారులు తెలిపారు.
లాంచీ టికెట్ బుకింగ్ కోసం..
శ్రీశైలానికి టికెట్లను www.tstdc.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. వివరాలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సీఆర్ఓ 9848540371, నాగార్జునసాగర్‌లో 7997951023 నంబర్లలో సంప్రదించాలి.
లాంచీ ప్రయాణం ఆహ్లాదకరం
గత ఏడాది నందికొండ నుంచి శ్రీశైలానికి లాంచీలో వెళ్లాను. లాంచీ ప్రయాణం చాలా బాగుంది. కనుమిందు చేసే కృష్ణమ్మ అందాలు మనుసును దోచుకుంటాయి. ఇప్పుడు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీళ్లు నిండుగా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా లాంచీలో శ్రీశైలం వెళ్లాలనుకుంటున్నా.
– కేవీ, ప్రకృతి ప్రేమికుడు, పైలాన్‌కాలనీ