నందికొండ, జూలై 11: సాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం క్రస్ట్, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా వరద కొనసాగుతుండడంతో రిజర్వాయర్ క్రమంగా నిండుతూ జలకళను సంతరించుకుంటుంది. రిజర్వాయర్‌లో నీటి మట్టం 590 అడుగులకు 544.80(198.4730 టీఎంసీలు) వరకు నీరుచేరింది.రిజర్వాయర్‌కు 1,48,868 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా ఎస్ఎల్బీసీ ద్వారా 1100 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలానికి1,49,011క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 3 క్రస్ట్ గేట్ల ద్వారా 81,333 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎన్నెస్పీ అధికారులు శుక్రవారం ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ఈనెల 4న పాలేరు రిజర్వాయర్ నింపడం కోసం ఎడమకాల్వకు నీటి విడుదలను ప్రారంభించి 1.7 టీఎంసీ నీటిని విడుదల చేశారు.
సహజ ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఇం ధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. నాగార్జునసాగ ర్ డ్యాం ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్ని జెన్కో సీఎండీ హరిశ్, ఎమ్మె ల్యే జయవీర్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠిలతో కలసి శుక్రవారం సందర్శించారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో మొదటి టర్బన్కు చేపడుతున్న మరమ్మతు పనులు, కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీరు, బొగ్గు లాంటి ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుంటూ సంవృద్ధిగా ఉత్పత్తిని చేపడుతున్నామన్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్‌ల్లో వరదజోరు కొనసాగుతుండడంతో నీటి వనరులతో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాగార్జునసాగర్ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో మొదటి టర్బన్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉండాలని, ఎటువంటి నిర్వహణ లోపాలు లేకుండా ఎప్పటికప్పడు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు హిల్‌కాలనీలోని విజయవిహార్‌కు చేరుకున్న వీరికి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. వీరితో హైడల్ డైరెక్టర్ బాలరాజు, జెన్కో సీఈ మంగేశ్‌కుమార్, ఎస్ఈ రఘురాం తదితరులు ఉన్నారు.