నందికొండ, ఆగస్టు 7 : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద జోరు కొనసాగుతున్నది. శ్రీశైలం నుంచి 2,95,652 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం సాగర్ డ్యామ్ 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,49,732 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ 584.50 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తూ శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. బుధవారం ఉదయం వరకు 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేయగా శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో 18 క్రస్ట్ గేట్లకు తగ్గించారు. సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తిన సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల్లో 80 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేసినట్లు ఎన్నె స్పీ అధికారులు తెలిపారు. సాగర్‌కు 2,95,652 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఎస్ఎల్బీసీ ద్వారా 1800, ఎడమ కాల్వ ద్వారా 8,193, కుడికాల్వ ద్వారా 6,979 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 2,8948 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 882.90 అడుగులు ( 203.89 టీఎంసీలు) ఉన్నది. సాగర్ డ్యామ్‌ను రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరతచంద్రపవార్, సూర్యాపేట అదనపు కలెక్టర్ లత సందర్శించారు. కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
చింతలపాలెం : నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడంతో మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టుకు 2,37,324 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 6 క్రస్ట్ గేట్లతో 2,78,064, జెన్కో గేట్లతో 10,000 మొత్తం 2,88,064 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో వెళ్తున్నది. దీంతో తెలంగాణ జెన్కోలో 10,000 క్యూసెక్కుల నీటితో 4 యూనిట్లను రన్ చేస్తూ 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ఎస్ఈ దేశ్యానాయక్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 (45.77 టీఎంసీలు)అడుగులకుగానూ ప్రస్తుతం 168.63(36.46 టీఎంసీలు) అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నందికొండ, ఆగస్టు 7 : ఎడమ కాల్వకు నీటి విడుదల చేసే సమయంలో దానిపై ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో రెండు టర్బైన్ల ద్వారా 60 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. 2014లో రెండు టర్బైన్లలోకి నీరు చేరి చెడిపోతే వాటికి మరమ్మతులు చేసి 2015 నుంచి ఉపయోగంలోకి తెచ్చారు. కానీ అప్పటి నుంచి తరుచూ రెండో టర్బైన్ మొరాయిస్తున్నది. 2022 డిసెంబర్లో రెండో టర్బైన్ పూర్తిగా ఆగిపోయింది. 2023లో వరదలు లేక ప్రాజెక్టులోకి నీరు రాలేదు. సంవత్సర కాలం వ్యవధి ఉన్నా జెన్కో అధికారులు టర్బైన్ను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టలేదు. ప్రస్తుతం ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుండడంతో హడావుడిగా టర్బైన్ మరమ్మతులు చేపట్టారు. ఆగస్టు 5న ఎడమ కాల్వకు నీటి విడుదల సమయంలో టర్బైన్ను రన్ చేయగా వైండింగ్‌లో సమస్య రావడంతో 5 నిమిషాలు తిరిగి ఆగిపోయింది. ఎడమ కాల్వ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు వెళ్తున్నా జలవిద్యుత్ కేంద్రం ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే తరహాలో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో రెండో నంబర్ టర్బైన్ కూడా రిపేరులో ఉంది. జెన్కో ఎస్ఈ రఘురామ్‌ను వివరణ కోరగా ఎడమ కాల్వ జల విద్యుత్ కేంద్రంలోని టర్బైన్‌లో సాంకేతిక సమస్య ఉన్నదని, మరమ్మతులు చేపడుతున్నామని, త్వరలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతామని తెలిపారు.