నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు ఉవ్వెత్తున జరిగాయి. తెలంగాణ రాష్ర్టాన్ని, రాష్ట్ర అభివృద్ధిని అపహాస్యం చేసేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలు చేబూని భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటు జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి ర్యాలీకి నేతృత్వం వహిస్తూ మర్రిగూడ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు మోదీ వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు. క్లాక్‌టవర్ సెంటర్లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై అక్కసుతోనే మోదీ పార్లమెంట్ సాక్షిగా విషం కక్కారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. జిల్లా కోర్టు పరిధిలోని న్యాయవాదులు, ఎంజీ యూనివర్సిటీలో టీఆర్ఎస్వీ నేతలు నల్ల బ్యాడ్జీలతో మోదీ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు నేతృత్వంలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్‌చౌక్ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేతృత్వంలో మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నకిరేకల్ మండలం పాలెంలో రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణంలోని వ్యాపార వాణిజ్య వర్గాలు సైతం మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వృత్తిదారులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సద్దులచెరువులో నీళ్లల్లోకి దిగి వినూత్నరీతిలో ఆందోళన వ్యక్తం చేశారు. హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లో మోదీ ఖబడ్దార్ అంటూ నినదిస్తూ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. పలుచోట్ల శవయాత్రలు నిర్వహించి కర్మకాండలు చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌లో కోర్టుల బయట న్యాయవాదులు నిరసన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా అంతటా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలకు దిగాయి. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగి మోదీ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూర్(ఎం), గుండాల మండలాల్లో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఆందోళనల్లో పాల్గొన్నారు. మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇక మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్తో పాటు ఇతర పక్షాలు సైతం ఆందోళనలకు దిగాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉద్యమ స్ఫూర్తి చాటేందుకుసిద్ధంగా ఉండాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి
భువనగిరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకుని సొంతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ర్టానికి మోదీ రూపంలో శని దాపురించిందన్నారు. భూతంలా బీజేపీ తెలంగాణను వెంటాడుతుందన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పథకాలతో ప్రధాని మోదీకి వణుకు పుడుతుందని, దేశవ్యాప్తంగా రాష్ట్ర పథకాలను ప్రజలు డిమాండ్ చేస్తారని బెంబేలెత్తిపోతున్నట్లు తెలిపారు. అందుకే తెలంగాణపై మోదీ తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మంత్రి అన్నారు. మోదీ కుయుక్తులను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం మరోసారి ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.