రామగిరి, జూలై 6: ‘నల్లగొండలోని చారిత్రక లతీఫ్ సాహెబ్ దర్గా గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణ స్థలంలలో వక్ఫ్‌బోర్డు భూమి ఉంది. ఆ భూమిలో రోడ్డు నిర్మాణం చేయొద్దు. తక్షణమే ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలి. ముస్లిం పెద్దలతో చర్చించాలి. వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండా ఎలాంటి రోడ్డు వేయొద్దు’ అని పలువురు ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారు. నల్లగొండలోని ఈద్గాలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముస్లిం పెద్దలతో చర్చించకుండా రోడ్డు వేయడం సరికాదన్నారు.
అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారులపై వత్తిడి చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వక్ఫ్‌భూమిలో రోడ్డు పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చి మాకే వ్యతిరేకంగా పని చేస్తారా..? అని మంత్రి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించారు. మంత్రి అనుచరుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తమ భూములు స్వాధీనం చేసేలా నిర్మాణం ఉందని వాపోయారు. మంత్రి ఆదేశాలు లేకుండానే రూ.20 కోట్లతో నిర్మాణానికి టెండర్స్ ప్రకటన విడుదల చేశారని తెలిపారు. ఇదే విషయం కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు.
వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండా అధికారులు రోడ్డు నిర్మాణాకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. వక్ఫ్‌బోర్డు భూమిలో నిర్మించిన వాటర్ ట్యాంక్ తొలగించాలని కోరారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా వ్యహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు ఆపాలని బ్రహ్మంగారి, దుర్గామాత ఆలయాల వద్దకు దారిని ఏర్పాటు కోసమే తప్ప ఈ రోడ్డు దర్గా కోసం కాదని అనుమానం వ్యక్తం చేశారు. పట్టణంలో అనే ప్రాంతాల్లో వక్ఫ్‌భూములు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకోవడం లేదన్నారు.
ఈ విషయంపై వక్ప్‌బోర్డు సీఈవోకు సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. సమస్య పరిష్కరించకుండా వ్యహరించడంతో కలిగే పరిణామాలకు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. సమావేశంలో ముస్లిం మత పెద్ద మౌలానా ఎహసానొద్దీన్, ఎంఎఐం జిల్లా అధ్యక్షుడు రజీయొద్దీన్, ఎంఏ హఫీజ్‌ఖాన్, జియావుద్దీన్బాబా, మాజీ కౌన్సిలర్ సయ్యద్, ఇబ్రహీం, న్యాయవాది మాసూద్ అలీ, జిలానీ తదితరులు పాల్గొన్నారు.